Share News

చేనుకు మందు.. రైతుకు రోగం

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:11 AM

మన దేశ గ్రామీణ ప్రజానీకం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. పంటలపై విచక్షణారహితంగా చల్లుతున్న రసాయన మందులు (పెస్టిసైడ్స్‌) రైతులు, పల్లె ప్రజల రక్తాన్ని....

చేనుకు మందు.. రైతుకు రోగం

  • పంటలపై చల్లే పెస్టిసైడ్స్‌తో క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు, రక్తహీనత

  • వైద్య సిలబస్‌‌లో లేని ‘పెస్టిసైడ్‌ టాక్సికాలజీ’

  • ప్రభుత్వాలకు నివేదించడంలో పూర్తిగా విఫలం

  • 3 నిమిషాల లోపు ముగిసే ఓపీడీ పరీక్షలు

  • రోగ నిర్ధారణ లేక చనిపోతున్న అన్నదాతలు

  • శ్రీలంక, కాలిఫోర్నియా నమూనాలను మనదేశంలో అమలు చేసేదెప్పుడో?

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): మన దేశ గ్రామీణ ప్రజానీకం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. పంటలపై విచక్షణారహితంగా చల్లుతున్న రసాయన మందులు (పెస్టిసైడ్స్‌) రైతులు, పల్లె ప్రజల రక్తాన్ని విషపూరితం చేస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్లు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, గర్భస్థ శిశువుల్లో లోపాలు వంటి భయంకరమైన వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ విషయాన్ని మన దేశ వైద్య వ్యవస్థ పసిగట్టలేకపోతోంది. ఈ పెనుముప్పును గుర్తించడంలో, రోగ నిర్ధారణ చేయడంలో, ప్రభుత్వాలకు నివేదించడంలో పూర్తిగా విఫలమవుతోంది. పరిశోధనా పత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న రసాయనాల ముప్పు.. ఆస్పత్రుల క్లినికల్‌ ప్రాక్టీస్‌‌లో మాత్రం లేకుండా పోతోంది. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో రసాయన మందుల వాడకం వల్ల వస్తున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలపై హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి రూపొందించిన నివేదిక అకాడమీయా.ఎడ్యు జర్నల్‌లో ప్రచురితమైంది. ఆయన పరిశోధనలో విస్తుగొలిపే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పంజాబ్‌లోని పత్తి పండిం చే మాల్వా ప్రాంతాన్ని నేడు దేశం క్యాన్సర్‌ బెల్ట్‌గా పిలుస్తోంది. అక్కడ జాతీయ సగటు (లక్షకు 80 మంది) కంటే ఎక్కువగా, ప్రతి లక్ష మందికి 136 మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. బటిండా నుంచి పటియాలాకు వెళ్లే రైలును స్థానికంగా క్యాన్సర్‌ రైలుగా పిలుచుకుంటున్నారు. ఇక్కడి రైతులు ఒక పంట కాలంలో ఏకంగా 15 సార్లు పురుగుల మందు లు కొడుతున్నారు. ఈ పురుగు మందుల పిచికారీతో రైతుల డీఎన్‌ఏ తీవ్రంగా దెబ్బతింటున్నట్లు స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (పంజాబ్‌) పరిశోధనల్లో తేలింది. కేరళలోని కాసరగోడ్‌ ఎండోసల్ఫాన్‌ విషాదం, ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్దానం కిడ్నీ వ్యాధులు.. ఇవన్నీ పురుగు మందుల వాడకం వల్ల వచ్చినవేనని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే అక్కడి స్థానిక వైద్యులు మాత్రం వీటిని ధ్రువీకరించలేకపోతున్నారు. రోగులకు క్యాన్సర్‌ వస్తే పొగాకు, మద్యం వంటి అలవాట్లను సాకుగా చూపిస్తున్నారే తప్ప.. వారు పీల్చిన రసాయ న గాలిని, తాగిన కలుషిత నీటిని వైద్యులు అస్సలు పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఒక రైతు ఒక ఏడాది పంట కాలంలో సుమారు రూ.30 వేలు పురుగుమందుల కొనుగోలుకు, వాటి పిచికారీ కోసం ఖర్చు చేస్తుంటే.. ఆ పంట ద్వారా రూ.40 వేల ఆదాయం వస్తోందని, కానీ.. ఆ ఫెస్టిసైడ్స్‌ ద్వారా వచ్చే జబ్బుల చికిత్స కోసం రూ.20-30 వేల వరకు ఖర్చు చేస్తున్నారని పరిశోధకులు పేర్కొన్నారు.

2.jpg


వైద్య విద్యలోనే లోపం.. అప్‌డేట్‌ కాని సిలబస్‌

మన వైద్య కళాశాలల్లో మెడికోలకు బోధించే జాతీ య వైద్య మండలి(ఎన్‌ఎంసీ) కరికులంలో తీవ్రమైన లోపాలున్నాయని డాక్టర్‌ దొంతి నర్సింహారెడ్డి ఎత్తి చూపారు. రసాయన విషాల గురించి వివరించే టాక్సికాలజీని కేవలం ఫోరెన్సిక్‌ మెడిసిన్‌లో భాగంగా క్రిమినల్‌ కేసులు, శవపరీక్షల కోణంలోనే బోధిస్తున్నారు. నేటి వైద్యులకు 1990 కాలం నాటి ఆర్గానోఫాస్పేట్‌ విషాల గురించి మాత్రమే అవగాహన ఉంది. ప్రస్తు తం మార్కెట్లో విస్తృతంగా వాడుతున్న ‘నియో నికోటినాయిడ్స్‌’, ‘పైరెథ్రాయిడ్స్‌’ హెర్బిసైడ్స్‌, ఫంగిసైడ్స్‌తో కలగలపి వస్తున్న ఆధునిక రసాయనాల ప్రభావంపై వారికి కనీస శిక్షణ లేదు. దాంతో పురుగుమందుల కా రణంగా వస్తున్న జబ్బులను పసిగట్టడంలో తీవ్రంగా విఫలమవుతున్నారు. అలాగే ఇటువంటి ఆధునిక పురుగుమందులకు కనీసం యాంటీడోట్‌ను కూడా కనిపెట్టడం లేదు. ముఖ్యంగా నియోనికోటినాయిడ్‌ రసాయనాలు గర్భస్థ శిశువుల, చిన్నపిల్లల మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తాయని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. కానీ, పల్లెల్లో పిల్లలు మానసిక వైకల్యంతో వస్తే వైద్యులు దానిని పోషకాహార లోపం గా భావిస్తున్నారే తప్ప.. తల్లిదండ్రుల రసాయన ఎక్స్‌పోజర్‌గా గుర్తించడంలేదు. ఇక వైద్య విద్యార్థులకు అందించే వైద్యుల నిరంతర విద్య (సీఎంఏసీ) కార్యక్రమాలను ఫార్మాస్యూటికల్‌ కంపెనీలే ఎక్కువగా స్పాన్సర్‌ చేస్తుండటంతో.. వారు కొత్త మందులు, ల్యాబ్‌ పరికరాల గురించే మాట్లాడుతున్నారు తప్ప.. వ్యవసాయ రసాయనాల వల్ల వచ్చే జబ్బులపై వైద్యులకు అవగాహన కల్పించడం లేదు.

రోగిని చూసే సమయం 3 నిమిషాల్లోపే?

పురుగు మందుల పిచికారీతో వచ్చే జబ్బులను గుర్తించకపోవడానికి ఆస్పత్రుల్లోని పనిఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. ప్రభుత్వ ఆస్పత్రుల ఓపీడీలలో ఒక రోగిని పరీక్షించడానికి డాక్టర్‌కు సగటున 2.2 నిమిషాల సమయం మాత్రమే దొరుకుతోంది. ఇంత తక్కువ సమయంలో వైద్యుడు కేవ లం పైపైన మందులు రాయగలరు తప్ప.. మీరేం పంట వేస్తారు? ఏ మందులు స్ర్పే చేశారు? గ్లోవ్స్‌ వేసుకున్నారా? మీ ఊరి తాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది? వంటి కీలక ప్రశ్నలను ఏ ఒక్క డాక్టర్‌ అడగడం లేదు. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లాలో పాన్‌ ఇండియా చేసిన సర్వేలో పురుగు మందులు పిచికారీ చేసిన రైతులు వాంతులు, శ్వాసకోశ ఇబ్బందులతో వస్తే.. అక్కడి వైద్యులు వాటిని సాధారణ ఇన్ఫెక్షన్లుగా, వైరల్‌ జ్వరాలుగా నిర్ధారించి యాంటీబయాటిక్స్‌ ఇచ్చి పంపేసినట్లు తేలింది.


రోగ నిర్ధారణ ఎలా?

ఒకవేళ వైద్యుడికి అనుమానం వచ్చినా.. రోగి శరీరంలో రసాయన అవశేషాలు ఎంతమేర ఉన్నాయో పరీక్షించే కనీస మౌలిక సదుపాయాలు ఏ జిల్లా ఆస్పత్రిలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ అందుబాటులో ఉండటం లేదు. ఇక ఆర్గానోఫాస్పేట్‌ ప్రభావాన్ని గుర్తించే ప్రాథమిక ఎసిటైల్‌కోలినెస్టరేస్‌ పరీక్ష గానీ, రక్తాన్ని విశ్లేషించే పెస్టిసైడ్‌ రెసిడ్యూ ల్యాబ్‌లు గానీ గ్రామీణ భారతంలో అందుబాటులో లేవు. పరీక్షలు లేకపోవడం వల్ల కేసులు నమోదు కావు. కేసులు లేనందున ప్రభుత్వం ల్యాబ్‌లు ఏర్పాటు చేయదు.

మహిళల్లో రక్తహీనత అసలు కారణం ఇదేనా?

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ ఎస్‌-5) ప్రకారం దేశంలో 57శాతం మంది మహిళలు, 67శాతం మంది పిల్లలు తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రభుత్వం దశాబ్దాలుగా ఐరన్‌ మాత్రలు ఇస్తు న్నా.. పల్లెల్లోని మహిళల్లో రక్తహీనత తగ్గకపోవడం వెనుక పెద్ద రహస్యం దాగి ఉంది. గ్రామీణ మహిళలు ఎటువంటి రక్షణ లేకుండానే చేతులతో పురుగు మందులు కలపడం, ఆ తర్వాత ఇంటివద్ద బట్టలు ఉతకడం వల్ల ఆ రసాయనాలు వారి చర్మం ద్వారా శ రీరంలోకి చేరుతున్నాయి. కానీ, వైద్యులు వీరికి కేవలం ఐరన్‌ టాబ్లెట్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.

ఏం చేయాలంటే..

రాబోయే ‘పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు’లో వైద్య రంగాన్ని ఒక కీలక భాగస్వామిగా మార్చాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. అలాగే వైద్య విద్య కరికులంను మార్చాలి. మెడికోలకు ఆధునిక పెస్టిసైడ్‌ టాక్సికాలజీపై ప్రత్యేక అవగాహన కల్పించి, వాటిపై పరీక్షలు పెట్టాలి. సాగు ఎక్కువగా ఉండే జిల్లాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఎసిటైల్‌కోలినెస్టరేస్‌ ల్యాబ్‌ పరీక్షలను అందుబాటులోకి తేవాలి. కిడ్నీ, క్యాన్సర్‌, రక్తహీనత రోగుల రసాయన హిస్టరీని రికార్డ్‌ చేయడం తప్పనిసరి చేయాలి. వైద్యులకు జవాబుదారీతనం తప్పనిసరి చేయాలి. కాలిఫోర్నియా తరహాలో రసాయన జబ్బుల నమోదు కోసం జాతీయ ‘ఇల్‌నెస్‌ రిజిస్ట్రీ’ని ఏర్పాటు చేయాలి. సెంట్రల్‌ ఇన్సెక్టిసైడ్‌ బోర్డ్‌లో వ్యవసాయ అధికారులతో పాటు ఆంకాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, పీడియాట్రీషియన్లకు శాశ్వత సభ్యత్వం కల్పించాలి.


ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయంటే?

మన పొరుగు దేశమైన శ్రీలంకలో హాస్పిటల్‌ డేటా ఆధారంగా అత్యంత ప్రమాదకరమైన పురు గుమందులను దశలవారీగా నిషేధించారు. ఫలితంగా అక్కడ ఆత్మహత్యలు, రసాయన మరణాలు 20 ఏళ్లలో 70శాతం తగ్గాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏదైనా రసాయన అనారోగ్యం అనుమానం వస్తే.. ఏ వైద్యుడైనా 24 గంటల్లోగా స్థానిక ఆరోగ్య అధికారికి రిపోర్ట్‌ చేయడం చట్టరీత్యా తప్పనిసరి చేశారు. దీనికోసం అక్కడ పెస్టిసైడ్‌ ఇల్‌నెస్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ నడుస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌లో మానవ బయో-మానిటరింగ్‌ ద్వారా ప్రజల శరీరాల్లోని పురుగుమందుల అవశేషాలు, స్థాయిలను గుర్తిస్తూ విధాన నిర్ణయాలు తీసుకుంటోంది.

కంపెనీలకు లేని జవాబుదారీతనం

అమెరికాలో రసాయనాల వల్ల క్యాన్సర్‌ వచ్చిందని దాదాపు 1.70 లక్షల మంది బేయర్‌-మోన్‌షాంటో కంపెనీలపై దావా వేయగా, సదరు కంపె నీ 2026 నాటికి బాధితులకు దాదాపు 11 బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాల్సి వచ్చింది. కానీ, భారతదేశంలో ఒక్క రైతు కూడా ఏ కంపెనీపైనా కేసు వేయలేదు. బాధ్యత వహించే చట్టాలూ లేవు. చివరకు కాసరగోడ్‌ బాధితులకు కూడా ప్రభుత్వమే రూ.500 కోట్ల నష్ట పరిహారం ఇచ్చింది తప్ప.. కంపెనీల నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు.

Updated Date - Jun 14 , 2026 | 04:12 AM