బీఆర్‌ఎస్ నేత కుటుంబానికి మంత్రి లక్ష్మణ్ భరోసా
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:39 PM
పండగ వేళ ఆ ఇంట్లో విషాదం నెలకొంది.. ఆర్థిక ఇబ్బందులతో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పండగను సైతం పక్కనపెట్టి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థిక సాయం అందించడంతో పాటు.. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
జగిత్యాల, సెప్టెంబర్ 14: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన ఎండపల్లి బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జగన్ కుటుంబ సభ్యులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. సోమవారం పరామర్శించారు. మృతుడి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన.. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనవంతు సాయంగా రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. రాజకీయాలకు అతీతంగా బాధిత కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన పరిస్థితుల్లో వారికి ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆర్థిక సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన జగన్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆత్మహత్యకు ముందు జగన్ సోషల్ మీడియాలో కన్నీటి లేఖ రాయడం కుటుంబ సభ్యులు, స్థానికులను తీవ్ర విషాదానికి గురిచేసింది. జగన్ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రభుత్వపరంగా కూడా సహాయం అందించే ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా మృతుడి భార్యకు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందుంటానని మంత్రి లక్ష్మణ్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
నల్లగొండలో కేటీఆర్ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News