CM Revanth Reddy: శ్రీశైలం నుంచి నీళ్లకు అనుమతి ఇవ్వకుంటే.. జూరాల నుంచి తెచ్చుకుంటాం
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:03 AM
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి మొదటి విడత 45 టీఎంసీలు, మలి విడత మరో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి అనుమతులు రావాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు....
పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండకు తరలిస్తాం
మోదీ, బాబు, జగన్.. ఎవరు అడ్డొస్తారో చూస్తాం
రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న పని కూడా చేయను
సవాల్ చేసినవారు నీళ్లపై చర్చకు రాలేదేం?
బట్టలూడదీస్తాం, తోలు తీస్తామన్నారు.. మరి రాలే?
ఇప్పుడు ఎవరి తోలు తీయాలో ప్రజలే నిర్ణయిస్తారు
పార్టీ ఆఫీసులు, బహిరంగ సభల్లో మాట్లాడటం కాదు
శాసనసభకు వచ్చి చెబితే ప్రజలే తేల్చుకుంటారు
చట్ట సభలంటే కేసీఆర్‌కు ఏమాత్రం గౌరవం లేదు
కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పుకొంది ఆయనే
బీఆర్‌ఎస్ వల్లే ఏపీ నీళ్ల దోపిడీ చేస్తోంది
పాలమూరు-రంగారెడ్డిపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి మొదటి విడత 45 టీఎంసీలు, మలి విడత మరో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి అనుమతులు రావాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం జూరాల నుంచి తీసుకుంటామని ప్రకటించారు. వచ్చిన నీటిని వచ్చినట్లే రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీళ్లు తెచ్చుకుంటామని, పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. జూరాల తెలంగాణ ప్రాజెక్టు అని, అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవడాన్ని మోదీ, చంద్రబాబు, జగన్ సహా ఎవరు వచ్చి ఆపుతారో చూస్తామని సవాల్ చేశారు. ‘‘తెలంగాణపైన ఆన! ఈ కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు నష్టం కలిగే చిన్న తప్పు కూడా చేయబోను‘‘ అని అన్నారు. శనివారం శాసనసభలో ‘నీళ్లు-నిజాలు’ అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు.్త సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారమని, పక్క రాష్ట్రంతో చర్చల కోసం కమిటీలు వేసుకుని ముందుకు వెళుతున్నామని చెప్పారు. ‘‘వైఎస్ జగన్‌ను కేసీఆర్ ఇంటికి పిలిచి.. పంచభక్ష పరమాన్నాలు పెట్టి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టెండర్లు, కాంట్రాక్టులు ఇప్పించి.. కమీషన్లు కొట్టి.. వెన్ను తట్టి ప్రోత్సహిస్తే.. నేను కేంద్రంపై, చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించాను. రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని నేను సాధించిన విజయాలు ఇన్నాళ్లూ చెప్పలేదు. చంద్రబాబుతో సమావేశం జరిగినప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ఆపితే నదీ జలాలపై చర్చలకు వస్తానన్నాను. నాపై గౌరవంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆయన ఆపారు’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.
పాలమూరుతో కేసీఆర్‌కు సంబంధమే లేదు
తెలంగాణ రైతుల పట్ల తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ తోలు తీస్తామంటే.. నాలుక కోస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డితో కేసీఆర్‌కు వీసమెత్తు సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే అది భ్రమేనన్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఎత్తిపోతల పథకం పెట్టమని మొట్టమొదటి సారిగా వైఎ్‌సఆర్‌కు 2009లో లేఖ రాసింది పాలమూరు మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావు అని, ఈ ప్రాజెక్టుకు ఎవరి పేరైనా పెట్టాల్సి వస్తే ఆయన పేరే పెట్టాలని అన్నారు. అలాగే 2012లో అప్పటి కాంగ్రెస్ మంత్రి డీకే అరుణ, బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖ ఆధారంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు డీపీఆర్ కోసం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆ సమయంలో పాలమూరు ఎంపీగా ఉన్న కేసీఆర్.. ఈ ప్రాజెక్టును అడగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రస్తుత స్పీకర్, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ రాసిన లేఖ ఆధారంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేయాలంటూ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి ఆర్డర్ ఇస్తూ కేసీఆర్ మరో జీవో ఇచ్చారని తెలిపారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసిన 14 మంది రిటైర్డ్ ఇంజనీర్లతో కూడిన కమిటీ.. జూరాలకు 25 నుంచి 28 రోజుల పాటు లక్ష కంటే ఎక్కువ క్యూసెక్కుల వరద వస్తుందని, 318 మీటర్ల ఎత్తున ఉన్న జూరాల నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఎత్తి 675 మీటర్ల ఎత్తులో లక్ష్మిదేవి పల్లిలో పోయాలని, ఇలా 75 టీఎంసీల నీటిని ఎత్తి పోయవచ్చని తేల్చిందన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 32,300 కోట్లుగా నిర్ణయం జరిగిందన్నారు. అయితే మొత్తం ప్లాన్ పూర్తయిన తర్వాత కేసీఆర్ గేమ్ స్టార్ అయిందన్నారు. 318 మీటర్ల ఎత్తులోని జూరాల వద్దని చెప్పి 240 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీశైలం నుంచి నీటిని తోడుకునేలా కేసీఆర్ డిజైన్ మార్చారని తెలిపారు. దీంతో పంపులు, లిఫ్టులకే అంచనా వ్యయం వంద శాతం పెరిగిందన్నారు. 2015లో ఈ నిర్ణయం తీసుకుంటే 2022 వరకు డీపీఆర్ లేదన్నారు. డీపీఆర్ ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,800 కోట్లకు పెంచారని, భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీలు కలుపుకొని ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 85 వేల కోట్లకు ఒక్క పైనా కూడా తగ్గదన్నారు. సరైన సమయంలో పూర్తి కాకుంటే రూ.లక్ష కోట్లు అవుతుందని పేర్కొన్నారు.
కేంద్రమే ఆ ప్రాజెక్టును చేపట్టేది..
రాష్ట్రం నిధులతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసుకుంటామని 2015లో కేసీఆర్‌కు సన్నిహితుడైన చీఫ్ ఇంజనీరు మురళీధర్‌రావు కేంద్రానికి లేఖ రాశారన్నారు. పాలమూరు జిల్లా కరువు ప్రాంతం కాబట్టి.. కేసీఆర్ ప్రభుత్వం ఆ లేఖ రాయకుంటే ఏఐబీపీ కింద కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టి ఉండేదని, పోలవరం ప్రాజెక్టుకు భరించినట్లే 90 శాతం నిధులు భరించాల్సిన పరిస్థితి వచ్చేదని అన్నారు. లేకుంటే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితే ఉండేది కాదన్నారు. అలాగే ఈ ప్రాజెక్టు కోసం పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీల ద్వారా 11.90 శాతం వడ్డీపై 12 ఏళ్ల కాల పరిమితితో కేసీఆర్ రుణాలు తెచ్చారన్నారు. ప్రధాని మోదీతో తాము మాట్లాడి దాన్ని 36 ఏళ్ల కాలపరిమితి.. 7 శాతం వడ్దీకి మార్చుకున్నామన్నారు. కొన్ని రోజులుగా కేసీఆర్ కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దానిని బహిరంగ సభల ద్వారా వివరిస్తామని అంటున్నారని సీఎం గుర్తు చేశారు. అయితే బహిరంగ సభల్లో కాదు.. శాసనసభలో చర్చిద్దామని తాము ఆహ్వానిస్తే రాలేదని, చట్టసభలంటే ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. శాసనసభలో జరిగే చర్చలు రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయో లేదో ప్రజలు బేరీజు వేసుకుంటారని అన్నారు. రెండేళ్లుగా తాను ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష నేత సభకు రావడం లేదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో నాటి విపక్ష నేతలు జానారెడ్డి, భట్టివిక్రమార్కను సభలో బీఆర్‌ఎస్ ఎన్నో అవమానాల పాలు చేసిందని, అయినా వారు అన్నింటినీ భరించి, నాటి సర్కారుకు సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు. తాము మాత్రం బీఆర్‌ఎస్ సభ్యుల్ని అవమానించడం లేదన్నారు. ‘శాసనసభ సమావేశాలు పెట్టండి, మీ బట్టలూడదీస్తాం, తోలు తీస్తాం’ అని కేసీఆర్ అన్నారని, చర్చలో పాల్గొంటే కదా.. ఎవరి తోలు ఎవరు తీస్తారో తేలేదని రేవంత్ వ్యాఖ్యానించారు.
మరణశాసనం రాసిందే బీఆర్‌ఎస్..
1978లో బచావత్ ట్రైబ్యునల్ ఏర్పాటైందని, ఆ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811టీఎంసీలు కేటాయించారని తెలిపారు. కృష్ణా నదిపై ఉన్న వివిధ రాష్ట్రాల ఫిర్యాదులతో 2004 ఫిబ్రవరి 2న అప్పటి కేంద్ర ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. బచావత్ ట్రైబ్యునల్ పంపిణీ చేసిన 2,130 టీఎంసీల కేటాయింపులను కొనసాగిస్తూనే.. అదనపు నీటి లభ్యత అంచనాలతో 2,578 టీఎంసీలను కృష్ణా పరివాహక రాష్ట్రాలకు పంపిణీ చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగించవచ్చని పునర్విభజన చట్టంలో ఉందన్నారు. 2005 నుంచి 2014 మధ్య కృష్ణా బేసిన్‌లో పలు ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వదిలేసిందని ఆరోపించారు.
299 టీఎంసీలకు కేసీఆరే ఒప్పుకొని వచ్చారు
తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు మొత్తం 490 టీఎంసీల కేటాయింపులు ఉంటే.. 299 టీఎంసీలే ఉన్నాయంటూ ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వాదన లేవనెత్తారని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రమేర్పడే కొద్దిరోజుల ముందు 2014 జనవరిలో కేసీఆర్ బంధువు మురళీధర్‌రావు నాటి ప్రభుత్వానికి ఒక తప్పుడు లేఖ ఇచ్చారని తెలిపారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఏపీకి 811 టీఎంసీలు, అందులో తెలంగాణకు 299 టీఎంసీలే కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నట్టు చెప్పారు. కానీ, తెలంగాణ వచ్చాక సీఎంగా కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టి.. తెలంగాణ ప్రజల మరణ శాసనాన్ని రాశారని ఆరోపించారు. 2015 జూన్‌లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో.. తెలంగాణకు 299 టీఎంసీలు చాలునని అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు అంగీకరించిందన్నారు. 2016 సెప్టెంబరు 21న జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో తాత్కాలిక కేటాయింపులకు, 2020 అక్టోబరు 6న జరిగిన రెండో అపెక్స్ భేటీలో శాశ్వత కేటాయింపులకు 299 టీఎంసీలకే ఒప్పుకొని వచ్చారని మండిపడ్డారు. పదేళ్ల పాటు కృష్ణా నీటిని ఏపీకి తరలించుకుపోయేందుకు సహకరించి.. తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తాము రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాల కోసం కొట్లాడుతుంటే.. బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘‘సముద్రంలో పోయే నీళ్లను ఎలా వాడుకోవాలో చర్చించుకోవాలని వీరే ఉపదేశం ఇచ్చారు 2016లో. అప్పుడు చంద్రబాబుకు లైట్ వెలిగింది. ఇదేదో బాగుంది వాడుకుందామనుకున్నారు. వెంటనే వ్యాప్‌కో్‌సకు ఆర్డర్ ఇచ్చేసిండు. గోదావరి బనకచర్లకు ఈ రోజున పునాదిరాయి పడలేదు. 2016లో చంద్రబాబు ముందు నిలబడి మాట్లాడటానికి కేసీఆర్‌కు భయముంటే.. జగన్ మొదటిసారి సీఎం, వయసు, అనుభవంలో నీకంటే చిన్నవాడు. జగన్ ముందన్నా మాట్లాడి మనకు రావాల్సిన హక్కులను తీసుకురావచ్చు కదా? ఎన్ని సంవత్సరాలు పడతదో తెలియనిదానికి లింకు పెట్టి.. తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా తాకట్టు పెట్టి పదేళ్లలో ఏపీ 4.47 టీఎంసీలు కెపాసిటీతోని కృష్ణా నుంచి అక్రమంగా నీళ్లు తీసుకుపోయే తరలించడాని 13.37 టీఎంసీల నీళ్లు తరలించడానికి చేసిన నిర్వాకానికి ప్రజలు విధించిన శిక్షకు కొంతకాలమైనా మౌనంగా ఉండాలి కదా?’’ అని అన్నారు.