ఎస్సారెస్పీలో భారీగా పూడిక
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:05 AM
ఉత్తర తెలంగాణకు సాగునీటి ఆధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) పూడిక సమస్యతో క్రమంగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది.
112 టీఎంసీల నుంచి 80.5 టీఎంసీలకు తగ్గిన నిల్వ సామర్థ్యం
18 లక్షల ఎకరాల ఆయకట్టుకు భవిష్యత్తులో ముప్పు
పూడికతీత పనులపై కొరవడిన స్పష్టత
నిజామాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉత్తర తెలంగాణకు సాగునీటి ఆధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) పూడిక సమస్యతో క్రమంగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది. ఒకప్పుడు 112 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉండగా ప్రస్తుతం.. అది 80.5 టీఎంసీలకు తగ్గినట్లు నీటిపారుదల శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. ఫలితంగా సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. 1978లో నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ ప్రారంభంలో 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఉండేది. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరి వరదల ద్వారా చేరిన ఇసుక, మట్టి క్రమంగా జలాశయంలో పేరుకుపోయాయి.
1990లో నిర్వహించిన సర్వేల్లోనే నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు తగ్గినట్లు గుర్తించారు. ప్రస్తుతం అది 80.5 టీఎంసీలకు పరిమితమైంది. ఏటా సుమారు 0.8 టీఎంసీల పూడిక పేరుకుపోతున్నట్లు అంచనాలున్నాయి. దీంతో జలాశయం అసలు నిల్వ సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ఆధునిక సాంకేతికతతో సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉంది. సామర్థ్యం మరింత తగ్గితే 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో సుమారు 33 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. దీంతో జలాశయంలో పూడిక పేరుకుపోయిన ప్రాంతాలు బయటపడుతున్నాయి. సాధారణంగా నీటిమట్టం ఎక్కువగా ఉన్నప్పుడు పనులు చేపట్టడం కష్టమవుతుంది. ప్రస్తుతం యంత్రాలతో పూడిక తొలగించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టెండర్ల ప్రక్రియపై సందిగ్ధం
ఎస్సారెస్పీ పూడికతీత, పునరుద్ధరణ పనులు చేపడతామని ప్రభుత్వం గతంలో పలుమార్లు ప్రకటించింది. 2024 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టు అసలు నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి వెల్లడించారు. 2026 ఫిబ్రవరిలో రెండో దశ పూడికతీత ప్రతిపాదనలను మంత్రివర్గం ముందుంచి ఆమోదం, నిధులు పొందుతామని తెలిపారు. అయినప్పటికీ ప్రధాన జలాశయంలో పూడికతీతకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికైనా పూడికతీత పనులను త్వరగా ప్రారంభించి జలాశయ నీటి సామర్థ్యాన్ని పునరుద్ధరించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్