సెల్‌ఫోన్ చిచ్చు.. పెళ్లయిన నెల రోజులకే దంపతుల ఆత్మహత్య
ABN , Publish Date - May 11 , 2026 | 09:24 AM
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. కానీ, ఆ బంధం నెల తిరగకముందే చిధ్రమైంది. వివరాల్లోకి వెళితే..
కుకునూర్ పల్లి, మే 11: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. కానీ, ఆ బంధం నెల తిరగకముందే చిధ్రమైంది. సెల్‌ఫోన్ వివాదం ఆ దంపతుల మధ్య చిచ్చు పెట్టి, చివరకు ఇద్దరినీ మృత్యువు ఒడిలోకి చేర్చింది. కుకునూర్ పల్లి మండలంలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. రాయరం గ్రామానికి చెందిన వినయ్ (23), కొండపాకకు చెందిన అంజలి (21) గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి సరిగ్గా నెల రోజుల క్రితమే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. నవదంపతులు ఎంతో సంతోషంగా గడుపుతారని భావించిన కుటుంబ సభ్యులకు పిడుగులాంటి వార్త విన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజలి వేరొకరితో ఫోన్‌లో మాట్లాడుతోందన్న అనుమానం వినయ్‌లో పెరిగిపోయింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ ముదిరి ఒకరిపై ఒకరు కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అంజలి.. కొండపాకలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాన ప్రాణంగా ప్రేమించిన భార్య ఇక లేదన్న వార్త వినయ్‌ను కుదిపేసింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక.. తీవ్ర వేదనతో వినయ్ కూడా బలవన్మరణానికి సిద్ధపడ్డాడు. రాయరం మల్లన్నసాగర్ కట్ట పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు.
పెళ్లయిన నెల రోజులకే దంపతులిద్దరూ ఇలా విగతజీవులుగా మారడంతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు నిండు ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా, రెండు కుటుంబాల్లో తీరని విషాాదాన్ని నింపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుకునూర్ పల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
‘సూపర్ 50 నిర్మాణ్’ మోడల్.. కలెక్టర్లే డ్రైవ్ చేయాలన్న సీఎం
భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే
Read Latest Telangana News And Telugu News