ఉద్యోగం సాధించిన వారం రోజులకే విషాదం
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:48 AM
అమెరికాలో ఉన్నత విద్య పూర్తిచేసి ఉద్యోగంలో చేరిన వారం రోజులకే ఆ యువకుడి ఆనందం ఆవిరైంది.
న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం..
మునుగోడు యువకుడి దుర్మరణం
మునుగోడు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉన్నత విద్య పూర్తిచేసి ఉద్యోగంలో చేరిన వారం రోజులకే ఆ యువకుడి ఆనందం ఆవిరైంది. జీవితంలో స్థిరపడి తమకు అండగా నిలుస్తాడని ఆశించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన వీరమళ్ల సాయితేజ (25) అక్కడికక్కడే మృతిచెందాడు. మునుగోడులో వీరమళ్ల ప్రసాద్, శ్రీకన్న దంపతులు స్థానికంగా ఓ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు సాయితేజ ఉన్నత విద్య కోసం న్యూయార్క్ వెళ్లాడు. చదువు పూర్తి చేసి వారం రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు.
ఈ నెల 19న విధులకు హాజరై రాత్రి ఇంటికి వెళ్తుండగా.. సాయితేజ కారుకు హైవేపై ఓ జింక అడ్డువచ్చింది. సాయితేజ వాహనం నడుపుతుండగా, కారు జింకను ఢీకొట్టి రహదారిపై నిలిచింది. అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాన్ నిలిచిఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా, లోపల ఉన్న సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో మునుగోడులో విషాదఛాయలు అలుముకున్నాయి. న్యూయార్క్‌లో ఉంటున్న సాయితేజ బంధువులు మృతదేహాన్ని ఈనెల 23న స్వగ్రామానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అరెస్టు
పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..