Share News

నల్లగొండలో అంతరాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:55 PM

హైవేలపై ఆగి ఉన్న వాహనాలే లక్ష్యంగా అర్ధరాత్రి డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

నల్లగొండలో అంతరాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్
Nalgonda Diesel Theft

నల్లగొండ, ఏప్రిల్ 11: హైవేలపై ఆగి ఉన్న వాహనాలే లక్ష్యంగా అర్ధరాత్రి డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా అదనపు ఎస్పీ జి. రమేష్ శనివారం మీడియా సమావేశంలో ఈ ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రహదారుల పక్కన నిలిపి ఉంచిన లారీలు, ఇతర భారీ వాహనాల ట్యాంకుల నుండి డీజిల్ దొంగలిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.


ఈ క్రమంలో నిఘా పెంచిన పోలీసులు ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మైనర్ కావడం గమనార్హం. అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 40 లక్షల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1000 లీటర్ల డీజిల్, రెండు డీసీఎం (DCM) వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు, దొంగతనానికి వాడే ఇతర పనిముట్లు ఉన్నాయి. ఈ ముఠా సభ్యులపై గతంలోనే తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా అర్ధరాత్రి సమయాల్లో హైవేల వెంట ఆగి ఉన్న వాహనాలను గమనించి, డ్రైవర్లు నిద్రపోతున్న తరుణంలో అత్యంత వేగంగా డీజిల్ ట్యాంకుల సీల్ తొలగించి డీజిల్‌ను తమ వాహనాల్లోకి తరలించేవారు. హైవేలపై వాహనాలు నిలిపే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

వీడియోలతో ఏఎస్‌ఐ బ్లాక్‌మెయిల్.. మహిళా కమిషన్ సీరియస్..

నెల్లూరులో ఏబీఎన్‌పై దాడికి యత్నం.. వైసీపీ నేతలపై కేసులు

Updated Date - Apr 11 , 2026 | 05:16 PM