Share News

చిన్నారులకు ప్రాణం పోస్తున్న సత్యసాయి ఆస్పత్రి.. విజయ్, హరీశ్ ప్రశంసలు

ABN , Publish Date - Jul 04 , 2026 | 03:56 PM

సిద్దిపేట జిల్లాలోని కొండపాక సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ హాస్పిటల్‌ను సినీ నటుడు విజయ్ దేవరకొండ, మాజీమంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఆస్పత్రిలో 500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

చిన్నారులకు ప్రాణం పోస్తున్న సత్యసాయి ఆస్పత్రి.. విజయ్, హరీశ్ ప్రశంసలు
Sathya Sai Sanjeevani Hospital

సిద్దిపేట, జులై 4: జిల్లాలోని కొండపాక సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ హాస్పిటల్‌ను సినీ నటుడు విజయ్ దేవరకొండ, మాజీమంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఆస్పత్రిలో 500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 6000 గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడెక్కడి నుంచో పిల్లలు సత్యసాయి ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారన్నారు. ప్రతి మనిషి తనకు చేతనైన సాయం చేయాలని... మనం చేసిన మంచే చివరకు మిగులుతుందని చెప్పుకొచ్చారు.


తన ఏడాది జీతాన్ని ఈ దేవాలయానికి(సత్యసాయి ఆస్పత్రి) విరాళంగా ఇస్తున్నట్లు హరీశ్ ప్రకటించారు. పుట్టిన బిడ్డ గుండెలో రంధ్రం ఉంది, ప్రాణాలు నిలవడం కష్టం అన్న స్థితిలో వారికి ప్రాణాలు పోస్తే.. ఆ చిన్నారి ప్రాణాలతో పాటు వారి తల్లిదండ్రలు ప్రాణాలనూ కాపాడినట్లు అవుతుందన్నారు. ఈ ఆస్పత్రిని రాబోయే రోజుల్లో రీసెర్చ్ సెంటర్‌గా అభివృద్ధి చేస్తామని చైర్మన్ చెప్పారన్నారు. తెలంగాణ నుంచి స్వతహాగా హీరోగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ అని.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఆయనదని కొనియాడారు. కరోనా సమయంలో వేలాది మందికి సాయం అందించారని గుర్తుచేశారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సత్యసాయి స్కూల్లోనే విజయ్ దేవరకొండ చదివారన్నారు. ఇక్కడ కులం, మతం లేదని.. ఆపదలో ఉన్న పిల్లలకు సేవలందిస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.


వారి సేవలు వెలకట్టలేనివి: విజయ్ దేవరకొండ

అనంతపురంలో ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన వ్యవస్థ ఎన్నో రకాల సేవలందిస్తోందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ‘ఈరోజు నేను ఇలా ఉన్నానంటే సత్యసాయి స్కూల్లో అందించిన విద్యే కారణం. కొందరు వ్యక్తులు చూపించే ప్రేమ, దయ వల్ల అనేక మంది జీవితాలు మారిపోతాయి. అలాంటి ప్రేమను చూపించిన గొప్ప వ్యక్తి సత్యసాయి. ఇక్కడ చికిత్స పొందిన చిన్నారులు రేపు ఎలాంటి మార్పులు తీసుకొస్తారో సమాజం చూస్తుంది. ఒక లీడర్ తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంతానికి, పిల్లల వైద్యానికి ఎంతో మేలు చేస్తోంది. హరీశ్ రావు తీసుకున్న నిర్ణయం, శ్రమ వల్ల ఇంత గొప్ప ఆస్పత్రి ఇక్కడికి వచ్చింది. చైర్మన్ శ్రీనివాస్, ఆయన వైద్య బృందం చేస్తున్న సేవలు వెలకట్టలేనివి’ అని విజయ్ దేవరకొండ కొనియాడారు.


ఇవి కూడా చదవండి

100 రోజులు.. 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్ ఉక్కుపాదం

ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 04:48 PM