Share News

మద్యం కోసం వారం రోజుల మగ శిశువును అమ్మేసిన తల్లి

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:52 PM

మద్యానికి డబ్బులు లేకపోవడంతో కన్నబిడ్డనే విక్రయించింది కసాయి తల్లి. మెదక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

మద్యం కోసం వారం రోజుల మగ శిశువును అమ్మేసిన తల్లి
Medak News

మెదక్, మార్చి 10: మెదక్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యానికి డబ్బులు లేకపోవడంతో వారం రోజుల మగ శిశువును ప్రియుడితో కలిసి విక్రయించింది కసాయి తల్లి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హవేలీ ఘనపూర్ మండలంలోని లింగసానిపల్లి తాండాకు చెందిన మంజుల.. మహిపాల్‌ అనే వ్యక్తితో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. మంజుల ఫిబ్రవరి 10న మెదక్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మగ శిశువుకు జన్మనిచ్చింది.


అయితే మద్యానికి బానిసైన మంజుల డబ్బులు లేకపోవడంతో తన బిడ్డను విక్రయించాలని నిర్ణయించింది. మంజుల తన ప్రియుడితో కలిసి కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ దంపతులకు రూ.1.70 లక్షలకు శిశువును విక్రయించింది. మగశిశువు పుట్టిన వారం రోజులకే ఈ దారుణం జరిగింది. అయితే బాలింతకు ఇవ్వాల్సిన గుడ్లు, ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో అంగన్‌వాడీ టీచర్.. మంజుల ఇంటికి వెళ్లింది. శిశువు లేకపోవడాన్ని గమనించిన అంగన్‌వాడీ టీచర్.. అనుమానంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.


దీంతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ వెంటనే స్పందించిన అధికారులు.. శిశువును, తల్లి మంజులను సఖి కేంద్రానికి తరలించారు. మహిపాల్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మంజులతో కలిసి జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం

జగన్‌పై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 10 , 2026 | 05:35 PM