తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోంది.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్..
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:54 PM
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డంకులు సృష్టిస్తుందో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తే అనుమతి నిరాకరించడం కేంద్రం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
సిద్దిపేట: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తే అనుమతి నిరాకరించడం కేంద్రం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘పల్లె పల్లెకు పొన్నం అన్న- పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో మంత్రి పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ఆర్థిక సహకారం, నిధుల విషయంలో కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు గళమెత్తడం లేదని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం పక్క రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నప్పుడు తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని వారిని సూటిగా ప్రశ్నించారు.
రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా కేంద్రం కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం 'పల్లె పల్లెకు పొన్నం అన్న- పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయం.. నలుగురి అరెస్ట్