Share News

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: ఎమ్మెల్యే హరీశ్ రావు

ABN , Publish Date - Jul 12 , 2026 | 03:02 PM

సర్ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో ఓట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: ఎమ్మెల్యే హరీశ్ రావు
BRS MLA Harish Rao

సంగారెడ్డి జిల్లా: సర్ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో ఓట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ ప్రక్రియ ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడిందనే అవకాశం ఉండటంతో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు దీనిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని హరీశ్ రావు సూచించారు. పఠాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్‌లో సర్, పార్టీ సభ్యత్వ నమోదుపై బీఆర్ఎస్ అవగాహన సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరీశ్ రావు, గూడెం మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పార్టీ శ్రేణులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల అభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్కామ్‌ల ప్రభుత్వం పోయి, సంక్షేమ పథకాల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పఠాన్‌చెరు బీఆర్ఎస్‌కు బలమైన కోటని పేర్కొన్న ఆయన.. గత మున్సిపల్ ఎన్నికల్లో ఐదుకు ఐదు ఛైర్మన్ పదవులు గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా పఠాన్‌చెరు ఫలితాలపై అందరి దృష్టి నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన హరీశ్ రావు.. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కల్యాణలక్ష్మి వంటి పథకాల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు.


మూసీ సుందరీకరణ, ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలకు మాత్రం నిధులు లేవని చెబుతోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. అందాల పోటీలు, బోధి భవన్ వంటి కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేస్తున్నారని, అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించలేదని, సంస్థ యాజమాన్యమే పరిహారం చెల్లించిందని చెప్పుకొచ్చారు. పఠాన్‌చెరులో ఐటీ పార్కు కోసం గతంలో కేటాయించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం విక్రయించిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేదని, ప్రస్తుతం పరిస్థితి మారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఆస్పత్రిని ఇప్పటికీ ప్రారంభించలేదని హరీశ్ రావు ఆరోపించారు.


రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని మాజీ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 117 స్థానాలు గెలుస్తామని చెబుతున్నారని, అయితే కాంగ్రెస్ పార్టీ 9 సీట్ల కంటే ఎక్కువ గెలవదని హరీశ్ రావు జోస్యం చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఫిరంగి కోసం పోరాటం

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

Updated Date - Jul 12 , 2026 | 03:02 PM