మెదక్ జిల్లాలో డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో అదుపుతప్పిన బస్సు.. తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:09 PM
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ శివారులో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.
మెదక్, నవంబరు 14: జిల్లాలోని నర్సాపూర్ శివారులో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. శ్రీ వత్సల్ గురుకుల్ స్కూల్‌కు చెందిన బస్సులో సుమారు 20మంది విద్యార్థులు ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న గూడ్స్ వాహనంతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఓ బైకును కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లిన బస్సు చివరకు నిలిచిపోయింది.
ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో బస్సులో ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థంకాక చిన్నారులు హడలిపోయారు. అయితే బస్సు నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాద తీవ్రతను చూస్తే విద్యార్థులకు ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి మరింత విషాదకరంగా మారేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి బస్సులోని విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయం చేశారు. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఆయన పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఆందోళన నుంచి తేరుకున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బస్సు అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టడం, బైకును కొంత దూరం ఈడ్చుకెళ్లడం వంటి దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఇవీ చదవండి
నోట్లో పేలిన నాటు బాంబు.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
మహారాష్ట్రలో నడిరోడ్డుపై పులులు.. భయంతో వణికిపోయిన ఉపాధ్యాయులు