మంచిర్యాల జిల్లాలో ఆకాశం నుంచి కిందపడిన చేపలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 30 , 2026 | 08:46 PM
మంచిర్యాల జిల్లా చెన్నూరులో భారీ వర్షంలో చోటుచేసుకున్న ఓ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. వర్షంలో ఆకాశం నుంచి చేపలు కిందపడడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది..
మంచిర్యాల, జులై 30: జిల్లాలోని చెన్నూరు పట్టణంలో కురిసిన భారీ వర్షంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పుప్పాల హనుమాన్ వీధిలో వర్షపు నీటితో పాటు ఆకాశం నుంచి చిన్నపాటి చేపలు కూడా నేలపై పడ్డాయి. రోడ్లపై, ఇళ్ల ముందు ఒక్కసారిగా చేపలు కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఎవరికి దొరికిన చేపలను వారు పట్టుకుపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు చెరువులు, కుంటలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా సమీపంలోని చెరువుల నుంచి చేపలు ఎగిరి వచ్చి ఉండొచ్చని కొందరు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం నిజంగానే ఆకాశం నుంచి చేపల వర్షం కురిసిందని చెబుతున్నారు. చెరువులు, కాలువలో వరద నీరు చేరుతుండడంతో కొత్తనీరుకు చేపలు ఎదురీదువుతాయని దాంతో ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా చేపలకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి
భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
Read Latest Telangana News And National News