అనాథనని చెప్పి.. ప్రేమ పేరుతో దగ్గరై!
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:29 AM
ఓ వ్యక్తి తనను తాను అనాథనని చెప్పుకొని.. ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు! కొన్ని నెలల తర్వాత అతడు అనాథ కాదని, అతడు చెప్పుకొంటున్న పేరూ వేరని, మతం కూడా వేరని తెలియడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో వారు దర్యాప్తు చేపట్టారు.
యువతిని వివాహం చేసుకున్న వ్యక్తి
అతడు అనాథే కాదు.. పేరు కూడా నకిలీ
మతమూ వేరే.. బాధితురాలి గగ్గోలు
ఫోన్‌లో యువతులతో అశ్లీల వీడియోలు
పోలీసులకు ఫిర్యాదు.. నిందితుడి అరెస్టు
తూప్రాన్ (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తి తనను తాను అనాథనని చెప్పుకొని.. ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు! కొన్ని నెలల తర్వాత అతడు అనాథ కాదని, అతడు చెప్పుకొంటున్న పేరూ వేరని, మతం కూడా వేరని తెలియడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో వారు దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆరేళ్ల క్రితం గుండ్రెడ్డిపల్లికి చెందిన మన్నె సుజాత దంపతులు అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో మేడ్చల్ జిల్లా కౌకూర్ దర్గాకు వెళ్తుండేవారు. అక్కడ హేమంత్ అనే పేరు చెప్పుకొని ఓ వ్యక్తి వారిని పరిచయం చేసుకున్నాడు. తనకు ఎవరూ లేరని అనాథనని చెప్పి ఆ కుటుంబానికి అతడు దగ్గరయ్యాడు. తర్వాత అతడు గుండ్రెడ్డిపల్లికొచ్చి అక్కడే ఉంటున్నాడు. ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూనే సుజాత రెండో కుమార్తెకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఇద్దరికీ పెద్దలు గత మే నెలలో తూప్రాన్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరిపించాడు. తర్వాత కొన్నాళ్లకే హేమంత్ ప్రవర్తనపై భార్యకు అనుమానం మొదలైంది. పని పేరుతో తరచూ అతడు మియాపూర్‌కు వెళ్తుండటంతో అతడి కదలికలపై నిఘా పెట్టింది. హేమంత్ ఫోన్‌ను పరిశీలించిన ఆమెకు పలువురు మహిళలతో అతడు అసభ్యంగా గడిపిన వీడియోలు కనిపించాయి. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కొన్నిరోజుల క్రితం హేమంత్ ఆ ఊరొదిలి పారిపోయాడు. ఆదివారం అతను మళ్లీ గ్రామానికి చేరుకోవడంతో బాధితురాలు ఊర్లో వాళ్లకు విషయం చెప్పింది. గ్రామస్థులు అతడిని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో అతడు.. తాను అనాథను కాదని, తనకంటూ ఓ కుటుంబం ఉందని చెప్పాడు. అంతేనా.. తన మతం వేరని.. తన పేరు హేమంత్ కాదని, నాజర్ అని చెప్పాడు. అతడికి తల్లి, తమ్ముడు ఉన్నారని.. తల్లి కీసరలో, తమ్ముడు ఏపీలోని గుంటూరులో ఉంటున్నట్లు నిందితుడు నాజర్ చెప్పాడు. భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశామని ఎస్సై గంగరాజు తెలిపారు. నిందితుడు నాజర్ వద్ద ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకొని డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఆ బాలికపై ఏ కేసు నమోదు చేయట్లేదు: ఢిల్లీ పోలీసులు