మామునూర్ విమానాశ్రయానికి రూ.295 కోట్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:47 PM
వరంగల్ అభివృద్ధికి కీలకమైన మామునూర్ విమానాశ్రయ ప్రాజెక్ట్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి చేసి.. సేకరించిన భూమిని AAIకి అప్పగించింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, సెప్టెంబర్ 19: వరంగల్‌లో ప్రపంచ స్థాయి విమానాశ్రయం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మామునూర్ విమానాశ్రయం కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి.. సేకరించిన భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అప్పగించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.295 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ కలను సాకారం చేసే దిశగా ఇది ముఖ్యమైన అడుగు అని సీఎం అన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేందుకు మామునూర్ విమానాశ్రయం కీలక గేట్‌వేగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ సమగ్ర అభివృద్ధిలో మామునూర్ విమానాశ్రయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెరుగైన విమాన రాకపోకలతో హైదరాబాద్‌పై రవాణా ఒత్తిడి తగ్గడంతో పాటు వరంగల్ ప్రాంతానికి దేశ.. విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణ, విద్యా సంస్థలు, ఐటీ మరియు సేవా రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో వరంగల్ ఎయిర్‌పోర్ట్ కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయని సీఎం అన్నారు. మామునూర్ విమానాశ్రయం ద్వారా వరంగల్‌ను మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా, మామునూర్ విమానాశ్రయానికి తగిన పేరును సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విమానాశ్రయానికి పేరు నిర్ణయించే అంశంపై ముందుకు సాగనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News