గోదావరి నీళ్లతో తాండూరు, వికారాబాద్, పరిగి ప్రజల కాళ్లు కడుగుతాం: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Feb 07 , 2026 | 07:49 PM
గోదావరి నీళ్లతో తాండూరు, వికారాబాద్, పరిగి ప్రజల కాళ్లు కడుగుతామని, వికారాబాద్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలది చీకటి ఒప్పందమని రేవంత్ విమర్శించారు.
పరిగి, ఫిబ్రవరి 7: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లాలోని కీలక మున్సిపాలిటీ పరిగిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతూ, సంక్షేమమే ధ్యేయంగా తమ రెండేళ్ల పాలన సాగిందని ఆయన పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీలపై ఘాటు విమర్శలు
రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 'బీఆర్‌ఎస్ ఆఫీస్‌లోనే బీజేపీ నేతలకు టికెట్లు ఇస్తున్నారు. ఈ విషయాన్ని తాండూరుకు చెందిన బీజేపీ నేతలే స్వయంగా చెబుతున్నారు' అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఏనాడు స్థానిక సమస్యలను పట్టించుకోలేదని, ప్రజల కష్టాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలకే వారు ప్రాధాన్యత ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
నీటి ప్రాజెక్టులు - రూ. వేల కోట్ల దోపిడీ
నీటి ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని సీఎం రేవంత్ ఆరోపించారు. వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయిందని, ఇది బీఆర్‌ఎస్ నేతల అవినీతికి నిదర్శనమని అన్నారు. గోదావరి నుంచి 300 టీఎంసీలు సద్వినియోగం చేసుకుని ఉంటే 30 లక్షల ఎకరాలకు నీరు అందేదని.. కానీ గోదావరి ముసుగులో నిధులు దోచుకున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వాలన్న ఆలోచన గత పాలకులకు రాలేదని, తాము గోదావరి నీళ్లతో తాండూరు, వికారాబాద్, పరిగి ప్రజల కాళ్లు కడుగుతామని సీఎం హామీ ఇచ్చారు.
వికారాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
పరిగి, వికారాబాద్ ప్రాంతాల అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పష్టమైన హామీలు ఇచ్చారు. రాబోయే మూడేళ్లలో కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తెస్తామని స్పష్టం చేశారు. వికారాబాద్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు పనులను వేగవంతం చేశామని, ఓఆర్‌ఆర్ (ORR) తరహాలోనే ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, తద్వారా అభివృద్ధి పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.
ఇవి కూడా చదవండి..
మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్