ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు కొల్లగొట్టారు: సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:51 PM
గత ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమీషన్లు దండుకొని ఒక్క ఎకరానికీ నీరు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్: గత ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమీషన్లు దండుకొని ఒక్క ఎకరానికీ నీరు అందించలేదని ఆగ్రహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇవాళ (శుక్రవారం) సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ వచ్చిందని, కష్టకాలంలో ఆదుకున్న పాలమూరును ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు.
పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేస్తారని ఆశించామని, కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆయన చేసిందేమీ లేదని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. జిల్లాకు కారు పార్టీ అధినేత తీరని అన్యాయం చేశారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. నీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని.. వారి పాలనలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేశారని రేవంత్ పేర్కొన్నారు. ఒక్క కాళేశ్వరంపైనే రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టారని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారు. అది పూర్తి చేసి ఉంటే 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉండేదన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని.. వేల కోట్లు పెట్టి కేవలం పంపులు, లిఫ్టులు మాత్రమే నిర్మించారని సీఎం రేవంత్ మండిపడ్డారు.
నీటి పారుదల శాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పటికీ నగదు చెల్లిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. గత 30 నెలల్లో రూ.52 వేల కోట్లకు పైగా అసలు, వడ్డీ చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టులకు కనీసం భూసేకరణ చేయకుండా ఎక్కడికక్కడే వదిలేశారని.. ఆర్ అండ్ ఆర్ (R&R) ప్యాకేజీలు ఇవ్వకుండా రిజర్వాయర్లలో నీరు నింపగలమా? అంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ సూటిగా ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రతి 6 నెలలకోసారి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలో భూసేకరణ పూర్తి చేస్తామని, ప్రతిపక్షాలు అడ్డుకునేలా వ్యవహరించొద్దని సీఎం రేవంత్ హితవుపలికారు.
ఈ వార్తలు కూడా చదవండి
పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలి: ఎంపీ ధర్మపురి అరవింద్
తెలంగాణ జల హక్కులను కాపాడటంలో సర్కార్ విఫలం: హరీశ్ రావు