పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలి: ఎంపీ ధర్మపురి అరవింద్
ABN , Publish Date - Jun 05 , 2026 | 02:42 PM
రైతుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.
హైదరాబాద్: పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి రాజకీయాలు చేయడం తగదని అరవింద్ వ్యాఖ్యానించారు.
కేంద్రంపై నెపం సరికాదు
వరి కోతలు ప్రారంభమయ్యే ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో విఫలమై కేంద్రంపై నెపం మోపడం సరికాదని విమర్శించారు. దొంగ ఇసుక, మొరం రవాణా కోసం ట్రాక్టర్లు, లారీలు అందుబాటులో ఉంటే, రైతుల ధాన్యాన్ని తరలించేందుకు మాత్రం కొరత వస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ధాన్యాన్ని ఇళ్ల ముందు కుమ్మరిస్తామనడం రైతులను అవమానించడమేనని అన్నారు.
రాజీనామా చేయాలి
రాష్ట్రంలో ఎంత పంట ఉత్పత్తి అవుతుందో ముందుగానే అంచనా వేసి ప్రణాళికలు రూపొందించకుండా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అరవింద్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతకాకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపైనా విమర్శలు చేసిన ఆయన, ప్రస్తుతం ఉన్న నగర సమస్యలను పరిష్కరించకుండా కొత్త నగరాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగ భృతి, గ్రామీణ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి ఇప్పటివరకు కేంద్రం ముందు బలమైన వాదన వినిపించలేదని అరవింద్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read:
మైత్రీవనం అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
తెలంగాణ అభివృద్ధికి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అవసరం: రాంచందర్‌రావు