Share News

కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట అమ్ముకోలేని దుస్థితిలో రైతులు: నిరంజన్ రెడ్డి

ABN , Publish Date - May 24 , 2026 | 03:37 PM

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి 50 రోజులు గడిచినా.. వాటిని కొనుగోలు చేసే నాథుడే లేడన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట అమ్ముకోలేని దుస్థితిలో రైతులు: నిరంజన్ రెడ్డి
BRS Leader Niranjan Reddy

వనపర్తి, మే 24: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి 50 రోజులు గడిచినా.. వాటిని కొనుగోలు చేసే నాథుడే లేడన్నారు. శనివారం వనపర్తి జిల్లాలో అకాల వర్షం పడింది. ఈ నేపథ్యంలో వనపర్తి మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడారు. అనంతరం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో రేవంత్ సర్కార్‌కు స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు.


తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే నెంబర్ వన్‌గా యాసంగి పంట ఉండేదని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. లారీలు, ట్రక్కులు లేని అనర్హులకు టెండర్లు ఇవ్వడం వల్లే రైతులకు ఈ సమస్య వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్లు కొనుగోలు, వాహన టెండర్ల అవకతవకల విషయంపై చిత్తశుద్ధి ఉంటే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు లేఖ రాయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.


బిఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసిన మూడు, నాలుగు రోజుల్లోనే రైతుల అకౌంట్లో నగదు జమ అయ్యేదన్నారు. ఈ రేవంత్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కాక వాటిని తరలించ లేక రైతులు పడిగాపులు పడుతున్నారని తెలిపారు. ఒక మిల్లరు నుంచి ప్రభుత్వానికి రూ.120 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. అయినా అతనికి మూడు మండలాలకు ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్ట్ ఇచ్చారని బీఆర్ఎస్ నేత ఆరోపించారు.


జిల్లాకు చెందిన మంత్రి కుమారుడికి రేంజ్ రోవర్ కారు ఇవ్వడం వల్లే అతనికి ఈ టెండర్ దక్కిందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లుల జాబితాలో అధికార పార్టీకి సంబంధించిన వారి మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఆరు మిల్లులకే ధాన్యాన్ని కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడ్డ మిల్లర్లకు కేటాయింపులు జరిపే అధికారులు జైలుకు పోవడం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి హెచ్చరించారు.


అధికార పార్టీకి చెందిన జిల్లా మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షునికి అధికారులు పూర్తిగా అండదండలు అందిస్తున్నారని విమర్శించారు. శ్రీధర్ రెడ్డి హత్య జరిగి మూడేళ్లు కావస్తున్నా నేటికీ నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు. ఈ కేసులో నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కనుకనే వారిని వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసు పరిష్కరించకుంటే వారి బంధువులతో కలిసి ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వివాహేతర సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!

పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలి: ఎంపీ మల్లు రవి

For More TG News And Telugu News

Updated Date - May 24 , 2026 | 03:54 PM