Share News

రేవంత్‌రెడ్డి రెన్యువల్‌ సీఎం

ABN , Publish Date - May 07 , 2026 | 05:01 AM

రాష్ట్రంలో రైతుబంధును బంద్‌ పెట్టి రాహుల్‌ బంధు తెచ్చారని.. రాహుల్‌గాంధీ ఖాతాల్లో నిధులు జమచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

రేవంత్‌రెడ్డి రెన్యువల్‌ సీఎం

  • నెలనెలా రాహుల్‌గాంధీకి కప్పం కట్టి

  • సీఎం పదవి రెన్యువల్‌ చేసుకుంటున్నారు

  • ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి

  • ధాన్యంలో తాలు తీస్తే నీ తోలు తీస్తారు..

  • పైసల బస్తాలు మోసే సన్నాసికి ఎరువుల బస్తాలు ఇచ్చే తెలివేది?

  • వరంగల్‌ డిక్లరేషన్‌ పేరిట రైతులకు దగా

  • ఒక్క ఊళ్లో పూర్తిగా రుణమాఫీ జరిగినా రాజకీయాల్లోంచి తప్పుకుంటా..

  • మేడిగడ్డను వాళ్లే బాంబులతో కూల్చారేమో!

  • ‘రైతు సంగ్రామ సదస్సు’లో కేటీఆర్‌ ఫైర్‌

వరంగల్‌, మే 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో రైతుబంధును బంద్‌ పెట్టి రాహుల్‌ బంధు తెచ్చారని.. రాహుల్‌గాంధీ ఖాతాల్లో నిధులు జమచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌రెడ్డి రెన్యువల్‌ సీఎం అని.. నెలనెలా రాహుల్‌కు కప్పంకట్టి రెన్యువల్‌ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బుధవారం వరంగల్‌లో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్‌ మాట్లాడారు. రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌ సభ పేరిట దొంగ హమీలు ఇచ్చారని, 34 హామీల్లో ఒక్కదానినీ ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు. ‘‘ఎకరాకు రూ.15 వేలు సాయం ఏది? అన్ని పంటలకు బోనస్‌ ఏది? రైతు కూలీలకు రూ.12వేలు, అసైన్డ్‌ భూములకు పట్టాలు, పంటల బీమా పథకంపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? డిక్లరేషన్‌ ఇచ్చిన రాహుల్‌గాంధీ ఎక్కడ సచ్చాడు? దేశం కాంగ్రెస్‌ దరిద్రాన్ని వదిలేసుకుంటే.. మనం నెత్తిమీద పెట్టుకున్నాం’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

నిరూపిస్తే.. రాజకీయాల్లోంచి తప్పుకుంటా..

ఏడాదికి మూడు పంటలకు రైతుబంధు ఇస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. రైతులకు మూడు విడతల్లో రూ.30వేల కోట్లను ఎగ్గొట్టారని కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలోని 22లక్షల మంది కౌలు రైతులకు రూ.37,500 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఏ ఒక్క ఊళ్లో పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగినట్లు నిరూపించినా తాను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్‌ సవాల్‌ చేశారు. ఎనుముల రేవంత్‌రెడ్డి కాదని.. ఎగవేతల, ఏతుల రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.3.75 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ సొమ్మంతా ఏం చేశారని నిలదీశారు. హైకోర్టు తీర్పుతో కాళేశ్వరం అంశంలో ఇన్నిరోజులు కాంగ్రెస్‌ చెప్పింది అవాస్తవాలని తేలిందన్నారు. మేడగడ్డను కూడా ఆ సన్నాసులే ఏదో చేశారని, బాంబులు పెట్టి కూల్చారేమోనని వ్యాఖ్యానించారు.


కాళ్లు పట్టుకోవద్దు.. కాంగ్రెస్‌ కాలర్‌ పట్టండి..

కేసీఆర్‌ హయాంలో కరోనా సమయంలో కూడా 7వేల కేంద్రాలను పెట్టి ధాన్యం కొనుగోలు చేశామని కేటీఆర్‌ చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. ‘‘రైతులు ఎవరి కాళ్లు పట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. కాళ్లు పట్టుకోవద్దు.. కాంగ్రెస్‌ కాలర్‌ పట్టండి.. దండం పెట్టడం కాదు.. కాంగ్రెస్‌ పార్టీకి పిండం పెట్టండి. అలాగైతేనే రైతులకు మంచి రోజులు వస్తాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పంటల్లో తాలు తీస్తే.. రేవంత్‌రెడ్డీ రైతులు నీ తోలు తీస్తారు.. యాది పెట్టుకో నా కొడకా!! మక్కలు కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్‌ వెయ్యి ముక్కలు అవుతుంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మంత్రులను ఉరికించి కొడతారు: ఎర్రబెల్లి

మంత్రులు, ఎమ్మెల్యేలు రైతు మేళాలు నిర్వహించడం కాదని... దమ్ముంటే వ్యవసాయ మార్కెట్లకు, రైతుల కల్లాల వద్దకు రావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్‌ చేశారు. రైతులు ఉరికించి కొడతారని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌ది రాబందు పాలన అని, రైతుల కన్నీటిలో రేవంత్‌ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని మాజీమంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే దేవాదుల పూర్తి చేయాలని కాంగ్రెస్‌ సర్కారును ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

నాలుగు తీర్మానాలకు ఆమోదం

2022 మే 6న కాంగ్రెస్‌ ప్రకటించిన వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను వెంటనే నెరవేర్చాలంటూ బీఆర్‌ఎస్‌ వరంగల్‌ హంటర్‌రోడ్డులోని బీఎ్‌సకే మైదానంలో రైతు సంగ్రామ సదస్సును నిర్వహించింది. సదస్సులో నాలుగు తీర్మానాలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మృతి చెందిన వెయ్యిమంది రైతు కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని.. వరంగల్‌ డిక్లరేషన్‌లోని 34 హామీలను వెంటనే అమలు చేయాలని.. రైతులు పండించిన పంటలన్నింటికీ క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇవ్వాలని తీర్మానాలు చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేసి, రైతుబంధు సక్రమంగా ఇవ్వాలని తీర్మానాన్ని ఆమోదించారు. సదస్సుకు కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎడ్లబండ్లపై వచ్చి ఆకట్టుకున్నారు.

2.jpg

Updated Date - May 07 , 2026 | 05:01 AM