రేవంత్‌ను సీఎం చేయడమే క్రిమినల్ వేస్ట్: కేటీఆర్
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:38 AM
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ కాదని, 89 కేసులున్న రేవంత్‌ను ముఖ్యమంత్రిగా చేయడమే ‘‘క్రిమినల్ వేస్ట్’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను, యువతను అవమానించే ఆర్హత ముఖ్యమంత్రికి లేదని చెప్పారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ కాదని, 89 కేసులున్న రేవంత్‌ను ముఖ్యమంత్రిగా చేయడమే ‘‘క్రిమినల్ వేస్ట్’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను, యువతను అవమానించే ఆర్హత ముఖ్యమంత్రికి లేదని చెప్పారు. రేవంత్ తన జీవితంలో ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశారా, కనీసం ఒక ఉద్యోగ దరఖాస్తు ఫారం నింపారా అని కేటీఆర్ ప్రశ్నించారు. చివరకు తన ఎన్నికల అఫిడవిట్‌ను స్వయంగా నింపే తెలివి రేవంత్‌కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖకు రాజీనామా చేసి ఆ బాధ్యతలను ఓ యువకుడికి అప్పగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేవలం 10వేల కొత్త ఉద్యోగాలకే పరిమితమయ్యారని, ఎందులో విజయవంతమయ్యారో ప్రజలకు చెప్పాలన్నారు. స్వయంగా మంత్రులు, ముఖ్యమంత్రి అనుచరులు పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వేధింపులకు గురిచేయడం వల్ల పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారని ఆయన ఆరోపించారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ నిండిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం, అక్కడి నుంచి మిడ్‌మానేరు వరకు నీరు ఎలా వస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంపై రుద్దుతోందని ఆరోపించారు. ప్రైవేట్ కంపెనీ అప్పులను రాష్ట్ర ప్రజలపై మోపే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఇవి కూడా చదవండి
ఆ బాలికపై ఏ కేసు నమోదు చేయట్లేదు: ఢిల్లీ పోలీసులు