సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు.. ఢిల్లీ పర్యటనలు, బ్యాగుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:32 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ పర్యటనలు, బ్యాగుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ గతంలో జరిగిన పరిణామాలను గుర్తుచేశారు.
హైదరాబాద్, నవంబరు 20: సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీకి సంచులు మోసుకెళ్లే విషయంలో రేవంత్ రెడ్డికి పదికి పది మార్కులు వేయొచ్చంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనల సంఖ్య, బ్యాగుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు. 2015లో జరిగిన ఓటుకు నోటు కేసును ప్రస్తావించిన కేటీఆర్.. అప్పట్లో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్, డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని, ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. గతంలో బ్యాగులు మోసుకెళ్లే స్థాయి నుంచి ఇప్పుడు ఢిల్లీ వరకు బ్యాగులు తీసుకెళ్లే స్థాయికి ఎదిగారంటూ విమర్శించారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఏటీఎంగా మారారని కూడా ఆరోపించారు.
2028లో బీఆర్ఎస్ గెలుస్తుంది..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారని, మూడేళ్లు గడుస్తున్నా వాటి అమలు కనిపించడం లేదని విమర్శించారు. ఆటో డ్రైవర్లు, మహిళలు, ఉద్యోగులను అడిగితే ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వన్‌టైమ్ వండర్ లీడర్ అంటూ విమర్శలు చేశారు. మూడేళ్ల పాలనలో చేసిన పనులను వివరించకుండా ప్రతిపక్షాలపై కేసులు పెట్టి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. భారత్ సమ్మిట్ పేరుతో నిర్వహించిన కార్యక్రమం కాంగ్రెస్ సమ్మిట్‌గా మారిందని వ్యాఖ్యానించారు. 2028 డిసెంబర్లో రేవంత్ రెడ్డి రాజకీయంగా గడువు ముగుస్తుందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తం
పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా.. కోరం లేక నిలిచిన ప్రక్రియ
Read Latest AP News And Telugu News