లారీని ముందే హెచ్చరించిన మరో బస్సు డ్రైవర్.. ఆ తర్వాత ఘోర ప్రమాదం
ABN , Publish Date - Aug 26 , 2026 | 09:23 PM
కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఘోర ప్రమాదానికి ముందే ప్రమాదం ముంచుకొస్తుందని ఓ బస్సు డ్రైవర్ హెచ్చరించాడు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని పక్కకు జరపాలని సూచించినా.. కొద్దిసేపటికే మరో బస్సు అదే లారీని ఢీకొట్టింది..
సూర్యాపేట, ఆగస్టు 26: కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఘోర ప్రమాదానికి ముందే.. ఓ బస్సు డ్రైవర్ హెచ్చరించాడు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని పక్కకు జరపాలని సూచించిన కొద్దిసేపటికే మరో బస్సు అదే లారీని ఢీకొట్టింది. కోదాడ మండలం ద్వారకుంట గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందే డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై ఆగిపోయిన లారీని గమనించిన మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. లారీ డ్రైవర్‌ను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. లారీని పక్కకు జరపాలని సూచిస్తూ ZING బస్సు డ్రైవర్ హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై ప్రమాదకరంగా నిలిచిపోయిన లారీని ముందుగానే గుర్తించి హెచ్చరించినప్పటికీ లారీని తొలగించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రమాదానికి కారణమైంది.
ZING బస్సు వెళ్లిన కొంత సమయానికే వచ్చిన ఫ్రెష్ ట్రావెల్స్ బస్సు.. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 14 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై లారీ ఆగిపోవడం, ఆ తర్వాత దానిని గమనించకుండా వచ్చిన బస్సు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి ముందే మరో బస్సు డ్రైవర్ లారీని పక్కకు జరపాలని హెచ్చరించిన దృశ్యాలు వీడియోలో కనిపించడంతో ఈ ఘటనపై మరింత చర్చ జరుగుతోంది. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా పోలీసులు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణాలు, డ్రైవర్ల నిర్లక్ష్యం, రోడ్డుపై లారీ నిలిచిపోయిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీలో పాపం చేసిన వారెవ్వరూ శిక్షల నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర
తెలంగాణ వేదికగా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’
For AP News And Telugu News