Share News

రాజ్యాంగబద్ధమైన 'SIR' ప్రక్రియను రాజకీయం చేయొద్దు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Jun 25 , 2026 | 08:19 PM

రాజ్యాంగబద్ధమైన ‘SIR’ ప్రక్రియను రాజకీయం చేయొద్దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘SIR’ ప్రక్రియ ఒక చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ మాత్రమేనని, దీనిని ఏ ఒక్కరూ రాజకీయ కోణంలో చూడకూడదన్నారు.

రాజ్యాంగబద్ధమైన 'SIR' ప్రక్రియను రాజకీయం చేయొద్దు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy

హైదరాబాద్, జూన్ 245: రాజ్యాంగబద్ధమైన ‘SIR’(సర్) ప్రక్రియను రాజకీయం చేయొద్దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘SIR’ ప్రక్రియ ఒక చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ మాత్రమేనని, దీనిని ఏ ఒక్కరూ రాజకీయ కోణంలో చూడకూడదన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'SIR' అనేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా జరిగే ఒక నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అదే సమయంలో నకిలీ లేదా అక్రమ ఓట్లను తొలగించి ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో, క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు (BLO) ఇంటింటికీ తిరిగి ఈ సవరణలు చేపడుతున్నారని ఆయన తెలిపారు.


ఓటర్ల జాబితా సవరణ అనేది ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన ప్రక్రియ అని, దీనిపై కొన్ని రాజకీయ పక్షాలు స్వార్థ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని కిషన్‌రెడ్డి హితవు పలికారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియపై కావాలనే అపోహలు సృష్టిస్తూ, ప్రజలను, అధికారులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇటువంటి సవరణలు జరిగాయని గుర్తుచేసిన కేంద్రమంత్రి, ఇప్పుడు దీనికి రాజకీయ రంగు పులమడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులూ లేని పారదర్శకత కోసం ప్రజలు కూడా ఈ 'SIR' ప్రక్రియలో భాగస్వాములు కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.


Also Read:

తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి

టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..

Updated Date - Jun 25 , 2026 | 08:46 PM