నన్ను ఆపేవాడు తెలంగాణలోనే పుట్టలే
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:52 AM
రాష్ట్ర పొలిమేరలు దాటనివ్వకుండా తనని ఆపగలిగే వ్యక్తి ఇంకా తెలంగాణ గడ్డపై పుట్టలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.
మీ తాటాకు చప్పుళ్లకు భయపడటానికి నేను కేసీఆర్‌ని కాదు
నేనేంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు
మాటలాపి ఇచ్చిన హామీలు నెరవేర్చండి
సీఎం వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పొలిమేరలు దాటనివ్వకుండా తనని ఆపగలిగే వ్యక్తి ఇంకా తెలంగాణ గడ్డపై పుట్టలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఏ అంశంపై ఎక్కడ చర్చ పెట్టినా పాల్గొనడానికి తాను సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్రం సహకరించకపోతే కిషన్‌రెడ్డి పొలిమేర దాటబోరంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ‘మీరు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోయే వ్యక్తిని కాను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే కేసీఆర్‌ను నేను కాదు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలె.. నేను పుట్టింది బీజేపీలోనే.. చనిపోయేదీ ఈ పార్టీలోనే.. ’ అంటూ సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై ధర్నాలు, పోరాటాలు చేసి తాను ఈ స్థాయికి ఎదిగానని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలకు వ్యక్తిగత దూషణలు చేసుకోవడం తప్ప పని చేసే అలవాటు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి తానేం చేశానో చెప్పేందుకు తనకు రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాన మంత్రి కాలేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాహుల్ నాయకత్వ వైఫల్యం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల్లో గుండు సున్నా ఫలితాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇక, ‘ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి. వడ్లకు బోనస్ ఇవ్వలేదు.
రుణమాఫీ అరకొర చేశారు. నిరుద్యోగ భృతి ఏమైంది? బీసీలకు లక్ష కోట్లు ఏమైంది?’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కిషన్‌రెడ్డి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తే కాసీ రాష్ట్ర ప్రభుత్వానికి పూట గడిచే పరిస్థితి లేదన్నారు. రేవంత్ మాటలు కొండలు, కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని విమర్శించారు. తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో అధికారం మారినా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అడ్డగోలుగా అబద్ధపు హామీలు, అడుగడుగునా నమ్మకద్రోహం నడుమ క్షేత్రస్థాయి సమస్యలు గాలికి వదిలేసి గాల్లో మేడలు కడుతూ... విదేశాలపై వ్యామోహం చూపిస్తూ సొంత దేశంలో జరుగుతున్న అభివృద్ధిపై కారుకూతలు కూసిన ముఖ్యమంత్రుల గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. ఇలాగే మాట్లాడిన కేసీఆర్‌ను ప్రజలు ఫాంహౌస్‌కు పరిమితం చేశారు. ఇప్పుడు సీఎం సీటులో ఉన్న రేవంత్ కూడా తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. ఆయనకూ అదే గతి తప్పదు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే దళితులు, బీసీలు సీఎం ఇంటి ముందు ధర్నాలు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా హెచ్చరించారు.