Share News

టీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. రైతును రాజును చేసి చూపిస్తా: కవిత

ABN , Publish Date - Jul 10 , 2026 | 06:07 PM

తెలంగాణలో ఆదివాసీకి బిడ్డలు బైక్ కొందామన్నా బ్యాంకులు లోన్ ఇవ్వడం తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు లూటీ చేసిన వారి అప్పులు మాఫీ చేసిన బీజేపీ సర్కార్.. గిరిజనులకు ఎందుకు రుణాలు ఇవ్వట్లేదు? అని ఆ పార్టీ నేతలను ఆమె సూటిగా ప్రశ్నించారు.

టీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. రైతును రాజును చేసి చూపిస్తా: కవిత
TRS Chief Kavitha Kalvakuntla

అశ్వారావుపేట, జులై 10: ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేనను గెలిపిస్తే.. రైతును రాజును చేసి చూపిస్తా అని ప్రజలకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రాగానే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతుకు ప్రత్యేక కుర్చీ వేయిస్తామని తెలిపారు. త్వరలోనే మహిళల కోసం ఒక ప్రత్యేకమైన వినూత్న ఆలోచనను చేశానని చెప్పారు. దీనిని త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. అన్న రాజ్యం కాదు.. 'అక్క రాజ్యం' ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని తెలిపారు. కొత్త పార్టీలో మార్పులు ఉంటాయని.. 'పాంచజన్యం' పేరుతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఎంత పెద్ద సమస్యకైనా మొదటి అడుగుతోనే పరిష్కారం.. తన ప్రయాణానికి మీ సహకారం కావాలని ప్రజలను కోరారు.


శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్త గంగారం గ్రామం ఆదివాసి నాయకపోడు గ్రామాల్లో సమస్యలు వారి జీవన విధానాన్ని తెలంగాణ రక్షణ పార్టీ అధ్యక్షురాలు (TRS) కల్వకుంట్ల కవిత పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. రాజకీయాల కోసం రాలేదని.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే మీ ముందుకు వచ్చానని అన్నారు. వెనకబడిన ఆదివాసీ గిరిజనుల కోసమే 'తెలంగాణ రక్షణ సేన' పార్టీని స్థాపించానని వివరించారు. సమాజంలో ఉన్న వెనకబడిన వ్యవస్థను మార్చడానికే ఆడబిడ్డగా ధైర్యంగా తాను ముందుకు వచ్చానని పేర్కొన్నారు.


మీ గ్రామానికి రావడం పుట్టింటికి వచ్చినట్లుగా ఉంది.. గ్రామ దేవతల దర్శనం కల్పించిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ఎక్కడా మార్పు రాలేదు.. నిరుద్యోగం, కరెంట్ కష్టాలు ఇంకా పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకపోడు జాతిని 'గోండు నాయకపోడు' అని పిలవడం తీవ్ర బాధాకరమని అన్నారు. 1950 రికార్డుల్లో నాయకపోడు పేరు లేకపోవడం దురదృష్టకరం.. గిరిజనుల హక్కుల కోసం ఢిల్లీ దాకా పోరాడుతామని పేర్కొన్నారు.


తెలంగాణలో ఆదివాసీకి బిడ్డలు బైక్ కొందామన్నా బ్యాంకులు లోన్ ఇవ్వడం లేదని అన్నారు. బ్యాంకులు లూటీ చేసిన వారి అప్పులు మాఫీ చేసిన బీజేపీ సర్కార్.. గిరిజనులకు ఎందుకు రుణాలు ఇవ్వట్లేదు? అని ఆ పార్టీ నేతలను కవిత సూటిగా ప్రశ్నించారు. విదేశాల తరహాలో ఇక్కడి ఆదివాసీలకు రూ.2 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు బ్యాంక్ లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ పిల్లలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించాలి.. ఇది వారి ప్రాథమిక హక్కు అని అన్నారు. ఎస్టీలకు కేటాయించిన వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

Updated Date - Jul 10 , 2026 | 06:14 PM