ఏ అవసరం ఉన్నా అండగా నిలుస్తా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:27 PM
మధిరకు కావాల్సింది అభివృద్ధి మాత్రమే అని.. రాజకీయాలు కాదని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిరలో డిప్యూటీ సీఎం భారీ రోడ్ షోలో పాల్గొన్నారు..
ఖమ్మం, ఫిబ్రవరి 9: ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మధిర పట్టణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాలుగా మధిర మున్సిపాలిటీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో మధిర మున్సిపాలిటీలోని అన్ని వార్డులను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మధిర పట్టణ రూపురేఖలను పూర్తిగా మార్చే బాధ్యత తనదేనని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మధిరలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ తరహాలో మోడరన్ మహాప్రస్థానం శ్మశానవాటిక నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. మధిరకు కావాల్సింది రాజకీయాలు కాదని, కేవలం అభివృద్ధి మాత్రమేనని భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. అభ్యర్థుల గెలుపు రాజకీయాల కోసం కాదని.. అభివృద్ధి కోసమే అని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్-టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
డబ్బు ప్రధానం కాదని.. అభివృద్ధే ప్రధానమని, వ్యక్తులకన్నా వ్యవస్థలే ముఖ్యమని డిప్యూటీ సీఎం వివరించారు. మధిర మున్సిపాలిటీని రాష్ట్రానికి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఏ అవసరం ఉన్నా ప్రజలందరికీ అండగా నిలుస్తానని చెప్పారు. విజ్ఞులైన ప్రతి ఒక్కరూ మధిర అభివృద్ధిపై తమ ఆలోచనలు పంచుకోవాలని కోరారు. మహిళలను వడ్డీలేని రుణాలతో స్వయం ఉపాధి వ్యాపారస్తులుగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మునిసిపల్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థిగా రిటైర్డ్ ఎస్సై భార్య
కొమురంభీం జిల్లాలో మావోల కదలికలు.. రంగంలోకి పోలీసులు..
Read Latest Telangana News And Telugu News