రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Jul 10 , 2026 | 06:12 PM
రైతు భరోసా తుది విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అన్నదాతల నిధులు విడుదల చేసేందుకు బటన్ నొక్కారు. అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఖమ్మం: రైతు భరోసా తుది విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అన్నదాతల నిధులు విడుదల చేసేందుకు బటన్ నొక్కారు. అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పదేళ్లపాటు బీఆర్ఎస్ రాక్షస పాలన సాగిందని సీఎం రేవంత్ అన్నారు. వారి పాలనలో రైతులకు బేడీలు వేశారని మండిపడ్డారు. దీంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా ప్రజలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఖమ్మం జిల్లాలో 2023లో ఓ అద్భుతం జరిగింది. బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌లోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. దీంతో ఆనాడు కాంగ్రెస్‌లోకి ఉప్పెనలా జనం వచ్చారు. కారు పార్టీని ప్రజలు ఇక్కడ మళ్లీ మొలకెత్తనీయకుండా చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ డబ్బు మూటలను కాంగ్రెస్ తట్టుకోలేదని కొందరు అన్నారు. అయితే, 65 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పి మరీ గెలిచి చూపించాం. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి గుండు సున్నా వచ్చేలా చేశాం. 2023 ప్రభుత్వ ఏర్పాటు నుంచి ఏ ఎన్నికలైనా కాంగ్రెస్‌దే గెలుపు.
2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగవు. తెలంగాణలో 2029 జూన్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. 2029లో జరిగే కురుక్షేత్రంలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే. పార్లమెంట్ సీట్లు 26, అసెంబ్లీవి 182కి పెరుగుతాయి. 182లో 117 సీట్లు గెలిచి రెండోసారి ప్రజాపాలన వస్తుంది. భద్రాచల రాముడిపై ఆన.. ఇది కాంగ్రెస్ కార్యకర్తల ప్రతిన. కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం. పాపాల భైరవుడిని ఫామ్‌హౌస్‌లో బంధించాం. ఆ పాపాల భైరవుడికి ఇకపై విముక్తి లేదు. ఆనాడు వరి వేస్తే.. ఉరి వేసినట్లే అని కేసీఆర్ అన్నారు. కానీ మేం వ్యవసాయం దండగ కాదు.. పండుగ అన్నాం. పేదలకు సన్నబియ్యం, వడ్లకు బోనస్ అందిస్తున్నాం.
అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశాం. ప్రతి సందర్భంలోనూ వారిని ఆదుకుంటూ వస్తున్నాం. రైతు కళ్లల్లో ఆనందమే మాకు ఆశీర్వాదం. కల్వకుంట్ల కుటుంబంలో ఒకరంటే ఒకరికి నమ్మకం లేదు. కుళ్లు, కుతంత్రాలు, కుట్రలతో బయటకు వస్తున్నారు. అధికారం పోయిందనే అక్కసుతోనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. బావా బామ్మర్దులిద్దరూ ఊళ్లపై పడి తెగ తిరుగుతున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని విషప్రచారం చేశారు. ఇప్పుడు కరెంట్ తీగలు పట్టుకోండి.. సలసల మాడిపోతారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్. ఆనాడు డబుల్ బెడ్‌రూమ్‌ల పేరుతో సినిమా కథలు చెప్పారు. ఇప్పుడు పొంగులేటి 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నారు.
కన్నెపల్లి పంప్‌హౌస్‌లు ఓపెన్ చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కన్నెపల్లి పంప్‌లు ఆన్ చేస్తే భద్రాచల రాముడి ఆలయం సహా 44 గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ ఇంట్లో ఒకరంటే ఒకరికి పడదు. బీజేపీతో హరీశ్ రావు మంతనాలు జరుపుతున్నారో, లేదో భద్రాచల రాముడిపై ఒట్టేసి చెప్పాలి. కారు పార్టీలో ఉంటావో లేదో కేసీఆర్‌పై ఒట్టేసి హరీశ్ రావు చెప్పాలి. తాటిచెట్టంత పెరిగినా ఆయనకు బుర్రలో గుజ్జు లేదు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని కేటీఆర్ చెల్లెలే చెబుతున్నారు' అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ నేతలకు కంటి పరీక్షలు చేయించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం..