కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం..
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:06 PM
కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది. ఇవాళ ఢిల్లీకి చేరుకున్న నేతలంతా సర్(SIR) ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలో డబుల్, డూప్లికేట్ ఓట్ల తొలగింపు వంటి అంశాలను ఈసీఐ దృష్టికి తీసుకెళ్లారు.
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీఐ) బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది. ఇవాళ (శుక్రవారం) ఢిల్లీకి చేరుకున్న నేతలంతా సర్(SIR) ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలో డబుల్, డూప్లికేట్ ఓట్ల తొలగింపు వంటి అంశాలను ఈసీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈసీఐని కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ఉన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఓటర్ జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను గుర్తించి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా నకిలీ, డూప్లికేట్ ఓట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచించారు. అదే సమయంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపైనా పలు సూచనలు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ఓటర్ జాబితాల ప్రక్షాళన పారదర్శకంగా, రాజకీయ పక్షపాతం లేకుండా జరగాలని ఈసీఐకి సూచించారు.
అర్హులైన ఓటర్ల పేర్లు అనవసరంగా తొలగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరగాలంటే ఓటర్ జాబితా పూర్తిస్థాయిలో తప్పులు లేకుండా ఉండటం అత్యంత కీలకమని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్‌లో బోనాల సందడి.. జులై 16 నుంచి ప్రారంభం
కాంగ్రెస్ నేతలకు కంటి పరీక్షలు చేయించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్