పాల్వంచ వెంకన్నను దర్శించుకున్న చంద్రబాబు
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:24 AM
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం పర్యటించారు
తెలంగాణలో ఏపీ సీఎం పర్యటన
భద్రాద్రి జిల్లా పాల్వంచలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సతీసమేతంగా పూజలు
చంద్రబాబుకు స్వాగతం పలికిన మంత్రి తుమ్మల
కొత్తగూడెం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం పర్యటించారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ నవభారత్ క్యాంప్‌సలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తన సతీమణి భువనేశ్వరితో కలిసి సందర్శించారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు దంపతులకుఆలయ చైర్మన్ దేవినేని అశోక్ ఆలయంలో ఘన స్వాగతం పలకగా.. అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గురువారం ఉదయం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. సాయంత్రం హెలికాప్టర్‌లో కొత్తగూడెం కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పాల్వంచ నవభారత్ ప్రాంగణంలోని ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనానంతరం చంద్రబాబు విజయవాడ తిరుగు ప్రయాణమయ్యారు.

ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆలయంలో శుక్రవారం నిర్వహించే సుదర్శన హోమంలో పాల్గొననున్నారు. కాగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కొత్తగూడెం కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ప్రతిమను జ్ఞాపికగా అందించారు. కొత్తగూడెం, భద్రాచలం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, మాలోత్ రాందాస్ నాయక్, భద్రాద్రి కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు ఏపీ సీఎంకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇక, చంద్రబాబు రాక విషయం తెలిసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొత్తగూడెం కలెక్టరేట్ వద్దకు భారీగా తరలివచ్చారు. కలెక్టరేట్ నుంచి ప్రత్యేక వాహనంలో బయటకు వచ్చిన సందర్భంలో చంద్రబాబు వారికి అభివాదం చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ‘జై చంద్రబాబు, జై ఎన్టీఆర్’ నినాదాలు మారుమోగాయి.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు?
రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్..