Share News

ఖైరతాబాద్ గణేశ్‌ వద్ద భక్తుల రద్దీ.. రాత్రి 12 తర్వాత దర్శనం నిలిపివేత

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:44 PM

ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గణేశ్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 12 గంటల నుంచి ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఖైరతాబాద్ గణేశ్‌ వద్ద భక్తుల రద్దీ.. రాత్రి 12 తర్వాత దర్శనం నిలిపివేత
Khairatabad Ganesh Immersion

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గణేశ్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 12 గంటల నుంచి ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం బడా గణేశ్‌ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. మహా గణపతి విగ్రహాన్ని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఏపీ నుంచి భారీ టస్కర్‌ ఖైరతాబాద్‌కు చేరుకుంది. సుమారు 50 టన్నుల బరువున్న బడా గణేశ్‌ విగ్రహాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరలించేందుకు అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే మార్గంలో భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.


గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. శోభాయాత్ర భద్రత కోసం సుమారు 20 వేల మంది పోలీసులను మోహరించనున్నట్లు తెలిపారు. ఎల్లుండి జరిగే శోభాయాత్రపై 10 వేల కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా కొనసాగించనున్నారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. భక్తులు, గణేశ్‌ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. భారీగా తరలివచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ మళ్లింపులు, బారికేడ్లు, పర్యవేక్షణ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారు. ఖైరతాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే బడా గణేశ్‌ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోంది.

14వసారి బడా గణేశ్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ను దర్శించుకున్నారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా ఉన్నప్పటి నుంచి బడా గణేశ్‌ను దర్శించుకుంటున్నానని.. ఈసారి 14వ సారి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. గణేశ్ నిమజ్జన బందోబస్తు కోసం పోలీసు అధికారులు ఎంతో కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు. శుక్రవారం జరగనున్న నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.


ఈ వార్తలనూ చదవండి:

అక్కడ విద్యార్థులే వైద్యులు!
తొలి అడుగులోనే ‘కృత్రిమ’ గండం!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 09:46 PM