బీఆర్‌ఎస్ ఓటమిని నా మెడలో వేస్తారా?
ABN , Publish Date - Feb 28 , 2026 | 04:06 AM
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిని తన మెడలో వేస్తారా ? అంటూ తన సోదరుడు కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ శ్రేణులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో పార్టీ ఓడింది అహంకారం వల్లే
ఇండ్లు ఇవ్వలేదు, ఉద్యోగాలూ ఇవ్వలేదుగా..
వద్దన్నా సరే దోపిడీదారులకు టికెట్లు ఇచ్చారుగా
కేటీఆర్ ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించు
నా అరెస్టుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయ్
మద్యం కేసు అక్రమమని తెలిస్తే నాడు ఎందుకు మాట్లాడలేదు
అప్పుడు ఒంటరిగా వదిలేసి సానుకూల తీర్పు రాగానే సన్నాయి నొక్కులా?
కడిగిన ముత్యంలా బయటకు వచ్చా
సొంతపార్టీ ఏర్పాటుకు ముందు దేవుని ఆశీర్వాదంలా కోర్టు తీర్పు: కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిని తన మెడలో వేస్తారా ? అంటూ తన సోదరుడు కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ శ్రేణులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అహంకారం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయిందని, ఈ విషయాన్ని పార్టీ సమావేశాల్లో చర్చించలేదా ? అంటూ ఆమె ప్రశ్నించారు. మద్యం కుంభకోణం కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. అయితే, బీఆర్‌కే భవన్ వద్ద రైతు కమిషన్ చైర్మన్, సభ్యులతో భేటీ అనంతరం కవిత విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేత, తన సోదరుడు కేటీఆర్ ఎక్స్‌లో చేసిన ట్వీట్‌పై కవిత ఘాటుగా స్పందించారు. తన సోదరుడు కేటీఆర్ ఓ పక్క తనకు శుభాకాంక్షలు చెబుతూనే బీఆర్‌ఎస్ ఓటమికి ఆ కేసే కారణమనే అర్థం వచ్చేలా పోస్టు చేశారన్నారు. తన అరెస్టుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయని, ఓటమికి కారణాలేంటో కేటీఆర్‌కు, బీఆర్‌ఎస్ శ్రేణులకు తెలియదా? అని ఆమె నిలదీశారు. ఇండ్లు ఇవ్వకపోవడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది ఎన్నిసార్లు మొత్తుకున్నా మార్చకుండా.. మళ్లీ వాళ్లనే ప్రజలపై రుద్దాలని చేసిన ప్రయత్నాలే బీఆర్‌ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలని కవిత అన్నారు.
అనాడు చర్చలో ఉన్న అంశాలు ఇవేనని తెలిపారు. అన్నింటికంటే అధికంగా అహంకారం అనే అంశం వల్లే పార్టీ ప్రజల తిరస్కరానికి గురైందనే చర్చ అధికంగా ఉందన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించాలని, అలా కాక బీఆర్‌ఎస్ ఓటమిని తన మెడలో వేస్తానంటే సహించేది లేదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఓటమికి కారణాలేంటే ప్రజలు కూడా ఓసారి గుర్తు చేసుకోవాలని కవిత కోరారు. ఇక, బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి మద్యం కేసే కారణమని చెప్పేందుకు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా తీవ్ర ప్రయత్నం చేస్తుందని ఎద్దేవా చేశారు. అయితే, తన మీద పెట్టిన కేసు పార్టీ కోసం కాదా ? అని కేటీఆర్, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ చెప్పాలని అన్నారు. న్యాయస్థానంలో సానుకూల తీర్పు వచ్చిన వెంటనే దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించడం, ఇందుకోసం పార్టీ ఓటమిని తన మెడలో వేయాలని చూడడం తగదని కవిత మండిపడ్డారు. మద్యం కేసు విషయంలో మూడేళ్లుగా బీఆర్‌ఎస్ పార్టీ తనకేం మద్దతు ఇచ్చిందని ఆమె ప్రశ్నించారు. ‘పెంపకానికి వచ్చిన కోర్టు తీర్పు’ అంటూ సన్నాయి నొక్కులు ఏంటని ప్రశ్నించారు. మద్యం కేసు వల్ల బీఆర్‌ఎస్ ఓడిపోయిందనే మాట అవాస్తవం అని స్పష్టం చేశారు. ఇక, తన సోదరుడు కేటీఆర్ ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని, ఇకనైనా నిజాన్ని అంగీకరించి, ఎన్నికల్లో అసలేం జరిగిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. అలా కాకుండా ప్రజల మీద కోపాన్ని చూపించడం, తనని నిందిచడం సరికాదని పేర్కొన్నారు. పార్టీ ఓటమిని తన మెడలో వేస్తే ప్రజలు కూడా హర్షించరని తెలిపారు.
అప్పుడు ప్రెస్‌మీట్‌లు పెట్టలేదే ?
మద్యం కేసు అంశంలో కేటీఆర్ ట్వీట్‌లో చెప్పింది నిజమైతే.. తాను జైలుకు వెళ్లేంతవరకు కేటీఆర్ ఒక్కసారి కూడా ఎందుకు విలేకరుల సమావేశం నిర్వహించలేదని కవిత ప్రశ్నించారు. తాను జైలుకు వెళ్లింది పార్టీ కోసం కాదా? వెనకాల ఏంజరిగిందో మీకు తెలియదా ? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడిగారు. కేటీఆర్ మాత్రమే కాదు తన తండ్రి కేసీఆర్, పార్టీలోని ముఖ్య నేతలు కూడా ప్రెస్‌మీట్‌లు పెట్టి నాడు ఎందుకు మాట్లాడలేదని కవిత నిలదీశారు. నాడు తనని ఒంటరిగా వదిలేశారని, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా తనకు కనీస మద్దతు తెలుపలేదని వాపోయారు. బీజేపీ సోషల్ మీడియా బృందాలు తనపై దుష్ప్రచారం చేస్తున్నా పట్టించుకోలేదని అన్నారు. ఆ రోజు తనకు అండగా ఉండుంటే బీఆర్‌ఎస్ పార్టీకి ఈ గతి పట్టి ఉండేదా? అని కవిత ప్రశ్నించారు. రాజకీయాలో చేయాలంటే ఓటమిని ఒప్పుకునే ధైర్యం ఉండాలని అన్నారు. ఇక, మద్యం కేసు వల్ల కేజ్రీవాల్ పార్టీ కూడా ఎన్నికల్లో ఓడిపోయిందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారని, అయితే, కేజ్రీవాల్ అరెస్టు తర్వాతే ఢిల్లీలో ఎన్నికలు జరిగాయని, తెలంగాణలో మాత్రం తన అరెస్టుకు ముందే ఎన్నికలు వచ్చాయని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో తమకు పెద్ద ఆర్మీ ఉంది, పెయిడ్ బ్యాచ్‌తో ఏం చేయించినా నడుస్తుందని అనుకుంటే మాత్రం పొరపాటేనని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలకు నిజాలు చెప్పాలని కేటీఆర్‌ను ఉద్దేశించి కవిత అన్నారు.
కొత్త పార్టీ పెట్టే సమయంలో దేవుడి ఆశీర్వాదంలా తీర్పు
తాను రెండు నెలల్లో కొత్తపార్టీ పెట్టబోతున్నానని, ఈ సమయంలో కోర్టు ఇచ్చిన సానుకూల తీర్పును దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నానని కవిత తెలిపారు. మద్యం కుంభకోణం కేసు అక్రమంగా పెట్టారనే విషయాన్ని నిర్ధారిస్తూ. కేసును పూర్తిగా పక్కనపెడుతూ కోర్టు అందరినీ నిర్దోషులుగా విడుదల చేసిందని అన్నారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై తాము పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడిందని కవిత తెలిపారు. దేశంలో జరుగుతున్న రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా పెట్టిన ఈ కేసులో నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తాను ముందు నుంచి చెబుతున్నట్టుగానే కోర్టు తీర్పు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసు పెట్టిన సందర్భంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన జాగృతి నాయకులు, కార్యకర్తలకు కవిత ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. తాను కారాగారంలో ఉన్న సమయంలో తన పిల్లలకు అండగా నిలిచిన తన తల్లిదండ్రులు, అత్తమామలు, తన భర్త అనిల్‌కు కూడా కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసు వల్ల తన భర్త, పిల్లలు అయిదున్నర నెలలు నరకయాతన అనుభవించారని, అది వారిని మంచి మనుషులుగా తయారు చేసిందన్నారు.