జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి రావడం..హరీశ్ రావుకు ఇష్టం లేదు: ఎమ్మెల్యే సంజయ్
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:32 PM
బీఆర్ఎస్ పార్టీలోని నేతలపై స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందన్నారు.
జగిత్యాల, ఏప్రిల్ 20: బీఆర్ఎస్ పార్టీలోని నేతలపై స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందన్నారు. ఈ రోజు జగిత్యాల వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ సభకు ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సభ జగిత్యాలలో జరుగుతుంటే.. హరీశ్ రావుకు ఢిల్లీకి ఏం పని అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లోకి జీవన్ రెడ్డి రావడం.. హరీశ్ రావుకు ఇష్టం లేదన్నారు. జీవన్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎదగదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్ రావులను ఉరి తీయాలని జీవన్ రెడ్డి అనలేదా? అని ప్రశ్నించారు. హరీశ్ రావుతో బీఆర్ఎస్‌లోని పలువురు ఎమ్మెల్యేలు మంతనాలు జరిపారని విమర్శించారు. తెలంగాణ వద్దన్న జీవన్ రెడ్డిని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ బీఆర్ఎస్ నేతలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని జీవన్ రెడ్డి చాలా కాలంగా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇటీవల ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్‌లోకి రావాలంటూ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. అనంతరం ఎర్రవెల్లిలోని ఫాం హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ పార్టీలో చేరేందుకు జీవన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. దీంతో ఏప్రిల్ 20వ తేదీన జగిత్యాల సభలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై విధంగా స్పందించారు.
బీఆర్ఎస్ భవిష్యత్ అంధకారంలో ఉంది: ఎంపీ చామల
టి.జీవన్ రెడ్డి పార్టీలో చేరడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిఅన్నారు. జీవన్ రెడ్డిని ఎప్పుడూ హరీశ్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాది తర్వాత బయటకు వస్తుంటే హరీశ్ రావు ఢిల్లీ వెళ్లారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ అంధకారంలో ఉందన్నారు. హరీశ్ రావు ఢిల్లీలో ఎవరిని కలిశారో త్వరలో బయటకు వస్తుందని పేర్కొన్నారు. హరీశ్ రావు భవిష్యత్ ప్రణాళిక ఏమిటో ప్రజలకు తెలుసునని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయేలా కనిపిస్తోంది: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఏడాది తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకొస్తున్నారన్నారు. హరీశ్ రావు జగిత్యాలకు రాకుండా ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏ పార్టీ నేతలను హరీశ్ రావు కలుస్తున్నారో త్వరలోనే బయటకొస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయేలా కనిపిస్తోందంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జోస్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే అన్న క్యాంటీన్ల ఏర్పాటు: సీఎం చంద్రబాబు
కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్
Read Latest TG News And Telugu News