Share News

35 ఏళ్ల నాటి అప్పు.. వెతికి మరీ తీర్చిన స్నేహితుడు..

ABN , Publish Date - Jul 12 , 2026 | 04:52 PM

కేరళకు చెందిన ఇస్మాయిల్‌ 1991లో సౌదీ అరేబియాలోని అబ్కైక్‌లో పని చేసేవారు. అదే సమయంలో తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్నతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అయితే..

35 ఏళ్ల నాటి అప్పు.. వెతికి మరీ తీర్చిన స్నేహితుడు..

ధర్మపురి: ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే పట్టుదల ఉంటే ఏళ్లు గడిచినా బంధాలు చెక్కుచెదరవని కేరళ వాసి నిరూపించాడు. సుమారు 35 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలో తన స్నేహితుడి వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించి.. ‘స్నేహమంటే ఇదే కదా’ అన్నట్లు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. స్నేహితుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఘటన కేరళకు చెందిన ఇస్మాయిల్‌ నిజాయితీకి, తన స్నేహానికి నిదర్శనంగా నిలిచింది.


కేరళకు చెందిన ఇస్మాయిల్‌ 1991లో సౌదీ అరేబియాలోని అబ్కైక్‌లో పని చేసేవారు. అదే సమయంలో తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్నతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరూ మరో ముగ్గురు ప్రవాస కార్మికులతో కలిసి దాదాపు ఐదేళ్లు ఒకే చోట నివసించారు. ఆ సమయంలో లచ్చన్న వద్ద నుంచి ఇస్మాయిల్‌ 120 సౌదీ రియాళ్లు అప్పుగా తీసుకుని, కుదిరినప్పుడు తిరిగి చెల్లిస్తానని మాట ఇచ్చారు. ఆ తర్వాత భారత్‌కు లచ్చన్న తిరిగి రావడంతో ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. అప్పట్లో మొబైల్‌ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేకపోవడంతో ఒకరి ఆచూకీ ఇంకొకరికి దొరకలేదు. అయినా లచ్చన్న ఇచ్చిన డబ్బును ఇస్మాయిల్‌ మరచిపోలేదు. ఇటీవల తన పాత మిత్రుడిని వెతకాలని నిర్ణయించుకున్నారు. లచ్చన్నది ధర్మపురి అన్న ఒక్క విషయం ఏళ్లుగా గుర్తుపెట్టుకుని తాజాగా ఆన్‌లైన్‌లో అన్వేషణ ప్రారంభించారు. చివరికి గ్రామస్థుల సహకారంతో లచ్చన్న కుటుంబాన్ని గుర్తించారు.

Kerala2.jpg


జులై 9న ధర్మపురికి చేరుకుని లచ్చన్న కుటుంబ సభ్యులను ఇస్మాయిల్‌ కలుసుకున్నారు. తాను చెల్లించాల్సిన రూ.25 వేల మొత్తాన్ని వారికి అందించారు. ఆ సమయంలో లచ్చన్న గల్ఫ్‌లో ఉండటంతో ఇద్దరూ వాట్సాప్‌ వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు. తన వద్ద తీసుకున్న చిన్న మొత్తాన్ని ఇన్నేళ్ల పాటు గుర్తుపెట్టుకుని తిరిగి చెల్లించిన ఇస్మాయిల్‌ను లచ్చన్న ప్రశంసించారు. నిజాయితీ గల మంచి మనిషిగా కొనియాడారు. తమ స్నేహానికి ఈ ఘటన నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, ఈ సన్నివేశం గ్రామస్థులతో పాటు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. కొంత మంది డబ్బులు తీసుకుని ఎప్పుడు ఎగ్గొడదామా? అనే ఆలోచన చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సన్నివేశం అందరినీ ఆలోచింపజేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి.. భూగర్భ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు

డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

Updated Date - Jul 12 , 2026 | 04:53 PM