కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:08 PM
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, సెప్టెంబర్ 26: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు పేర్కొన్న ఆయన.. అక్టోబర్ 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక కమిటీ ముందుకు వాటిని తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. పుణేలోని సీడబ్ల్యూఆర్‌పీఎస్‌లో డిజైన్లపై శాస్త్రీయ నమూనా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) వ్యక్తం చేసిన అభ్యంతరాలు.. వివిధ రంగాల నిపుణులు అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకుని పునరుద్ధరణ డిజైన్లను రూపొందించినట్లు మంత్రి వివరించారు. సాంకేతిక అనుమతులు లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభిస్తామని.. నవంబర్ మధ్య నాటికి మూడు బ్యారేజీల వద్ద పునరుద్ధరణ పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2027 వర్షాకాలం ప్రారంభమయ్యేలోపే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
బ్యారేజీల పునరుద్ధరణలో తాత్కాలిక మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. భవిష్యత్‌లోనూ బ్యారేజీల భద్రతకు భరోసా కల్పించేలా దీర్ఘకాలిక పరిష్కారాలను అమలు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మూడు బ్యారేజీల పునాదులను గ్రౌటింగ్ ద్వారా మరింత బలోపేతం చేయడంతో పాటు, స్టిల్లింగ్ బేసిన్లను పొడిగించడం, అవసరమైన ప్రాంతాల్లో కొత్త కట్-ఆఫ్ వాల్స్ నిర్మించడం వంటి కీలక పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పునరుద్ధరణ పనుల్లో ప్రతి దశను నిపుణుల పర్యవేక్షణలోనే నిర్వహిస్తామని, నిర్మాణ నాణ్యత, సాంకేతిక ప్రమాణాలు, బ్యారేజీల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని మంత్రి స్పష్టం చేశారు. సాంకేతికంగా అవసరమైన అన్ని పరీక్షలు, పరిశీలనలు పూర్తిచేసి సంబంధిత అనుమతులు పొందిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ముఖ్యంగా బ్యారేజీల నిర్వహణ, నీటి నిల్వ వంటి అంశాల్లో భద్రతా అనుమతులు వచ్చిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాళేశ్వరం బ్యారేజీలను శాశ్వతంగా పటిష్టం చేసి, వాటి నిర్మాణ భద్రతను నిర్ధారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్’ ప్రచారం: మంత్రి దుర్గేష్
దుర్గగుడి ఘాట్‌రోడ్డుకు శాశ్వత రక్షణ చర్యలు.. దసరాకు సురక్షితంగా ఉండేలా ఆదేశాలు
Read Latest AP News And Telangana News And Telugu News