సీఎం రేవంత్ వెయ్యిరోజుల పాలనలో పథకాల అమలు సక్సెస్ మా పథకాల అమలుపై చర్చకు సిద్ధమా?
ABN , Publish Date - Sep 03 , 2026 | 02:16 AM
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పథకాలను విజయవంతంగా అమలు చేసిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి కితాబిచ్చారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చకు సిద్ధమా అని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
ప్రతి ఊరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం
గ్రామాల్లో దీనిపై చర్చకు మీరు సిద్ధమా?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం!
నాతో పాటు బస్సెక్కితే చూపిస్తా.. వస్తారా?
బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు జగ్గారెడ్డి సవాల్
కేసీఆర్ అసెంబ్లీకి రారని కేటీఆర్ అంటున్నారు
రాకండి..! అలాగే ప్రతిపక్షంలోనే ఉండండి!
రాహుల్‌పై మాట్లాడటం
తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమే
సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే మీ నాయన సీఎం అయ్యారు: జగ్గారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పథకాలను విజయవంతంగా అమలు చేసిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి కితాబిచ్చారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చకు సిద్ధమా అని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండేది కాదని.. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ లభించిందన్నారు. వివిధ వర్గాలు తమ సమస్యలపై ధర్నాలు చేసుకోగలుగుతున్నాయని, సచివాలయానికీ స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ తదితర పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని, రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తోందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలైన ఆరోగ్యశ్రీ పథకం కేసీఆర్ హయాంలో కనుమరుగైందని.. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నారని చెప్పారు.
ప్రతి గ్రామం, బస్తీలో ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని, వెయ్యి రోజుల్లో 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. దీనిపై గ్రామాలకు వెళ్లి చర్చ చేసేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. తనతో పాటు ఆర్టీసీ బస్సు ఎక్కితే మహిళలకు ఉచిత ప్రయాణం ఎలా అమలవుతుందో చూపిస్తానని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపైకేటీఆర్ విమర్శలు చేయడమంటే.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లేనని జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ కుటంబం అంతా సోనియాగాంధీ చుట్టూ తిరగలేదా? అని ప్రశ్నించారు. అధికారం పోగానే కేటీఆర్.. చెరువు నుంచి బయటపడ్డ చేపలా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లనే కదా.. కేసీఆర్ సీఎం.. కేటీఆర్ మంత్రి అయ్యింది అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ కోసం ఏపీలో పార్టీని చంపుకుని మరీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణకు ఒక దళితుడిని సీఎంగా చేస్తానన్న కేసీఆర్.. మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి రారని కేటీఆర్ చెబుతున్నారని.. ఆయనతో పాటు కేటీఆర్, హరీశ్‌కూడా అసెంబ్లీకి రాకుండా ఉంటే సరిపోతుందన్నారు. వారు అలాగే ప్రతిపక్షంలోనే ఉంటారని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి
అమెరికా పునాదులు కదిలిస్తాం.. కొత్త యుద్ధ వ్యూహం సిద్ధమన్న ఇరాన్
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి