అమెరికా పునాదులు కదిలిస్తాం.. కొత్త యుద్ధ వ్యూహం సిద్ధమన్న ఇరాన్
ABN , Publish Date - Sep 02 , 2026 | 07:24 PM
అమెరికాతో గత ఆరు నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇక నుంచి సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇరాన్ సరికొత్త హెచ్చరికలు జారీ చేసింది.
టెహ్రాన్, సెప్టెంబర్ 2: అమెరికాతో గత ఆరు నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇక నుంచి సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి ఈ హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాన్ కొత్త వ్యూహం!
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా మొహసిన్ రెజాయ్ స్పందిస్తూ.. 'యుద్ధ క్షేత్రం, డిప్లొమసీ, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొనే విషయాల్లో ఇరాన్ కొత్త వ్యూహం త్వరలోనే మీ పునాదులను కదిలిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా, మీరే సృష్టించుకున్న నరకం నుంచి బయటపడలేరు' అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డాయి. జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), కువైట్, బహ్రెయిన్, ఇరాక్‌లోని కుర్దిస్తాన్ రీజియన్‌లో ఉన్న యూఎస్ బలగాలే లక్ష్యంగా డ్రోన్లు, మిసైళ్లతో దాడులు నిర్వహించాయి.
పెళ్లి వేడుకపై దాడి - ఇరాన్ తీవ్ర ఆగ్రహం: దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ (Sirik) నగరంలో జరుగుతోన్న ఓ పెళ్లి వేడుకపై జరిగిన క్షిపణి దాడిలో ఒక చిన్నారితో సహా నలుగురు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి అమెరికాయే కారణమని, ఇది ముమ్మాటికీ 'యుద్ధ నేరం' (War Crime) అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాకాయ్ మండిపడ్డారు. ఇరాన్ అగ్ర సంప్రదింపుల నేత మహమ్మద్ బాకర్ కాలిబాఫ్ అమెరికాను 'సైతాన్'గా అభివర్ణించారు.
అమెరికా సైన్యం వివరణ: పౌరులను ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ తరహాలో అమెరికా సైన్యం ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ స్పష్టం చేశారు.
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో ఇరాన్ మైన్లు ఏర్పాటు చేయడం, యుఎస్ సిబ్బందిపై దాడులు చేయడమే కారణమని చెబుతూ అమెరికా.. ఇరాన్ స్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో 18 మంది మరణించడంతో ఇరాన్ ప్రతీకార దాడులను మరింత ముమ్మరం చేసింది. మరోవైపు, సౌదీ అరేబియాకు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడిలో ఇద్దరు ఫిలిప్పీన్స్ నావికులు ప్రాణాలు కోల్పోయారు.
ట్రంప్ హెచ్చరికలు.. శాంతి యత్నాలు
ఇరాన్ మరింతగా ప్రతీకార దాడులకు దిగితే కోలుకోలేని దెబ్బతీస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు. 'ఇలాగే కొనసాగితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనేదే మిగలదు' అని వ్యాఖ్యానించారు.
ఇంతటి తీవ్ర ఉద్రిక్తతల నడుమ కూడా, యుద్ధానికి స్వస్తి చెప్పేలా అమెరికా దౌత్యపరమైన ఒప్పందానికి ముందుకొస్తే తాము సానుకూలంగా స్పందిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..