Share News

వచ్చే బతుకమ్మ నాటికి ఇందిరమ్మ ఇళ్ల అప్పగింత: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Oct 14 , 2026 | 03:17 PM

పేదలకు ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదని, అర్హతే ప్రామాణికంగా ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

వచ్చే బతుకమ్మ నాటికి ఇందిరమ్మ ఇళ్ల అప్పగింత: మంత్రి పొంగులేటి
Indiramma Housing Scheme

హైదరాబాద్‌, అక్టోబర్ 14: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ వివక్షకు తావులేదని, అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్లు కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్‌ నియోజకవర్గంలోని పోచారంలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. క్యూర్‌ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందిరమ్మ టవర్స్‌ పనులకు 23 నియోజకవర్గాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.

మేడ్చల్‌ నియోజకవర్గంలో తొలి విడతగా 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పారదర్శకమైన బహిరంగ డ్రా ద్వారా ఫ్లాట్లు కేటాయిస్తామని, లబ్ధిదారులకు ఫ్లాట్‌తో పాటు భూమిలో వాటాకు సంబంధించిన హక్కులు కూడా కల్పిస్తామని చెప్పారు. అంతేకాకుండా, ఇందిరమ్మ టవర్స్‌ లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే బతుకమ్మ పండుగ నాటికి తొలి విడత లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించడమే లక్ష్యమని వెల్లడించారు.


రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 2.20 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.440 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలూ చదవండి

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో

Updated Date - Oct 14 , 2026 | 04:15 PM