Share News

చర్చకు ముందే రచ్చ!

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:09 AM

భారత్‌ సమ్మిట్‌ ప్రారంభానికి ముందే రగడ ప్రారంభమైంది. సదస్సులో చర్చలకు ముందే రచ్చ మొదలైంది.

చర్చకు ముందే రచ్చ!
bharathsummit

  • భారత్‌ సమ్మిట్‌పై అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం

  • హెచ్‌ఐసీసీలో సదస్సు ప్రారంభం.. నేడు, రేపు కీలక చర్చలు

  • 70 దేశాలకు చెందిన వెయ్యి మంది ప్రతినిధులకు ఆహ్వానం

  • వీరిలో 315 మంది విదేశీయులు.. వంద మందికిపైగా

    విదేశీ ప్రతినిధులకు వీసాల తిరస్కరణ, అనుమతి రద్దు

  • మోదీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్టు హెలా వీసా కూడా రద్దు

  • నలుగురు విదేశీయులను కేంద్రం వెనక్కి పంపిందని, చాలామందికి వీసాలు మంజూరు చేయలేదని శ్రీధర్‌బాబు మండిపాటు

  • మోదీ సర్కారు తీరుపై కాంగ్రెస్‌, ఎడిటర్స్‌ గిల్డ్‌ తీవ్ర విమర్శలు

  • సమ్మిట్‌కు వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనానికి బీజేపీ పిలుపు

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): భారత్‌ సమ్మిట్‌ ప్రారంభానికి ముందే రగడ ప్రారంభమైంది. సదస్సులో చర్చలకు ముందే రచ్చ మొదలైంది. రాజకీయ దుమారం రేగింది. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సదస్సులో పాల్గొనే విదేశీ ప్రతినిధులకు కేంద్రం వీసాలను తిరస్కరించడమే ఇందుకు కారణం. భారత్‌ సమ్మిట్‌ 2026 గురువారం హెచ్‌ఐసీసీలోని తెలంగాణ రైజింగ్‌ వేదికపై ప్రారంభమైంది. శుక్ర, శని వారాల్లో సదస్సు కొనసాగనుంది. ముగింపు వేడుకల్లో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు. అయితే, సదస్సుకు వస్తున్న పలువురి వీసాలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం తాజాగా వివాదాస్పదమవుతోంది. విలేకరుల ప్రశ్నలను ఎందుకు ఎదుర్కోరు? అంటూ నార్వేలో ప్రధాని మోదీని ప్రశ్నించి అప్పట్లో వార్తల్లో నిలిచిన ఆ దేశ జర్నలిస్టు హెలా లీంగ్‌ స్వెన్‌సెన్‌కు జారీ చేసిన భారతీయ వీసాను కేంద్ర హోం శాఖ ఆఖరి నిమిషంలో రద్దు చేసింది. దీంతో ‘భారత్‌ సమ్మిట్‌’లో ఆమె పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. ఈ మేరకు హెలా బుధవారం ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశారు.


journalist.jpg‘‘‘భారత్‌ సమ్మిట్‌లో ‘మీడియా భవిష్యత్తు, మీడియా స్వేచ్ఛ’ అనే అంశంపై జరిగే సదస్సులో మాట్లాడేందుకు నన్ను ఆహ్వానించారు. నాకు వీసా, రాజకీయపరమైనఅనుమతి కూడా లభించాయి. ప్రయాణానికి సిద్ధమై బుధవారం ఉదయం ఎయిర్‌పోర్టుకు బయల్దేరి వెళ్లటానికి కేవలం 10 నిమిషాల ముందు ఓస్లోలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది.

భారత్‌కు వెళ్లటానికి వీల్లేదని.. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు’’ అని పేర్కొన్నారు. భారత్‌ సందర్శనకు వీసా ఇచ్చి, చివరి నిమిషంలో వెళ్లటానికి వీల్లేదని చెప్పటం ఏమిటని ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్‌ షా జోక్యం కారణంగానే ఇలా జరిగి ఉంటుందన్నారు. ‘‘మేలో ఓస్లోలో మోదీని ప్రశ్నలు ఎందుకు ఎదుర్కోరని నిలదీసినందుకా? మోదీని, ఆయన విధానాలను విమర్శిస్తూ నేను పని చేసే నార్వే పత్రికలో వ్యాసాలు రాసినందుకా? భారతీయులు కూడా చూసేలా ఆన్‌లైన్‌లో విమర్శలు గుప్పించినందుకా? బిలియనీర్‌ వ్యాపారులు అంబానీ, అదానీలకు మోదీ అనుకూలంగా ఉండటాన్ని ప్రశ్నించినందుకా? కాక్రోచ్‌ జనతా పార్టీ సారథ్యంలో ప్రారంభమైన జెన్‌జీ ఉద్యమానికి అనుకూలంగా రాసినందుకా? సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేను ఇంటర్వ్యూ చేసినందుకా? వీటన్నింటి కారణంగానే భారత్‌కు రాకుండా నన్ను అడ్డుకున్నారా?’’ అని ఆమె ప్రశ్నలు గుప్పించారు.

విదేశీ ప్రతినిధులకు వీసాల తిరస్కరణ

భారత్‌ సమ్మిట్‌కు రావాల్సిన పలువురు విదేశీ ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం వీసాలను రద్దు చేసింది. సదస్సుకు హాజరయ్యేందుకు అంగీకరించిన వందమందికి పైగా విదేశీయుల వీసా దరఖాస్తులను తిరస్కరించటమో లేదా జాప్యం చేయటమో జరిగిందని సదస్సు నిర్వాహకులు ఆరోపించారు.


సదస్సు కోసం వస్తున్న నలుగురు విదేశీ ప్రతినిధుల వీసాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వారిని తిరిగి వెనక్కు పంపిందని మంత్రి శ్రీధర్‌బాబు ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. సదస్సుకు ఆహ్వానం అందుకున్న చాలా మంది విదేశీయులకు వీసాలు మంజూరు చేయలేదనీ చెప్పారు. అదే విధంగా సదస్సుకు వచ్చిన విదేశీ ప్రతినిధుల సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫారంను శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు చెక్‌ చేశారంటూ టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సదస్సుకు వస్తున్న వారి వీసాలను కేంద్రం రద్దు చేస్తుండటం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

భారత సదస్సు.. భారత వ్యతిరేక సదస్సు

సదస్సు ప్రారంభానికి ముందే కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటలదాడి మొదలైంది. ఇది భారత వ్యతిరేక సదస్సు అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. దేశంపై విషం చిమ్మే శక్తులకు ఇది వేదికగా నిలుస్తోందని దుయ్యబట్టారు. పదే పదే విఫలమవుతున్న రాహుల్‌ విజన్‌ను ప్రపంచానికి తెలియజెప్పేందుకు, ఆయ న్ను ప్రధాని అభ్యర్థిగా లాంచ్‌ చేసేందుకు దీనిని నిర్వహిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. జాతి వ్యతిరేక సమ్మిట్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన తెలపాలని బీజేపీ కార్యకర్తలకు, నేతలకు రాంచందర్‌ రావు పిలుపునిచ్చారు. మరి కొందరు బీజేపీ నేతలు రాహుల్‌ను అడ్డుకుంటామనీ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు సైతం బీజేపీ విమర్శలకు దీటుగా స్పందించారు. రాహుల్‌ దేశానికి కాబోయే ప్రధాని అని, ఆయన్ను లాంచ్‌ చేయాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మోదీ తర్వాత ఎవరిని లాంచ్‌ చేయాలా అని బీజేపీయే వెతుకుతోందని ఎద్దేవా చేశారు. విపక్షాలను బీజేపీ శత్రువుల్లా చూస్తోందంటూ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మండిపడ్డారు. భారత్‌ సమ్మిట్‌ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వమే అనుమతిని ఇచ్చిందని, విదేశీ ప్రతినిధులకు వీసాలూ మంజూరు చేస్తోందని, అటువంటప్పుడు ఇది భారత్‌ వ్యతిరేక సమ్మిట్‌ ఎలా అవుతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశ్నించారు.


70 దేశాలు.. వెయ్యి మంది ప్రతినిధులు

దేశ స్వాతంత్య్ర 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సదస్సుకు సుమారు 70 దేశాల నుంచి దాదాపు 1000 మంది రాజకీయ నాయకులు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు హాజరుకానున్నారు. వీరిలో 315 మంది విదేశీ ప్రతినిధులు. సదస్సులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో 12 ప్యానెల్స్‌తోపాటు 8 ప్రత్యేక చర్చలు నిర్వహించనున్నారు. తెలంగాణ అభివృద్ధి నుంచి ప్రపంచ రాజకీయాల వరకూ చర్చకు రానున్నాయి. ఏఐ, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, ఎన్నికల పారదర్శకత వంటి పలు కీలక అంశాలపై చర్చలు సాగనున్నాయి. శుక్రవారం ఉదయం తెలంగాణ రైజింగ్‌ వేదికపై పట్టణాభివృద్ధి, ఆర్థిక న్యాయంపై రెండు చర్చలు జరగనున్నాయి. పట్టణాభివృద్ధి ప్యానెల్‌కు మాజీ ఎంపీ దివ్య స్పందన, ఆర్థిక న్యాయ ప్యానెల్‌కు ప్రొఫెసర్‌ అమీర్‌ ఉల్లాఖాన్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ చర్చల్లో మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ వెంకట్‌ బల్మూర్‌, ఆర్థికవేత్త రతిన్‌ రాయ్‌ తదితరులు పాల్గొంటారు. మధ్యాహ్నం సామాజిక న్యాయం, సంక్షేమ విధానాలపై జరిగే ప్యానెల్స్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌, ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య, శాంతా సిన్హా తదితరులు పాల్గొంటారు. అదే రోజు అంతర్జాతీయ వేదికపై ఏఐ, క్లౌడ్‌ క్యాపిటలిజం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యువత రాజకీయాలు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు, మహిళా హక్కులపై చర్చలు జరగనున్నాయి. ప్రముఖ ఆర్థికవేత్త థామస్‌ పికెటీ, ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌, నెదర్లాండ్స్‌ మాజీ విదేశాంగ మంత్రి బెర్ట్‌ కోయెండర్స్‌, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌ శర్మ, కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి తదితరులు పాల్గొంటారు.


శనివారం సహకార సమాఖ్య విధానం, సంస్కృతి-సమాజం అంశాలపై చర్చలు నిర్వహించనున్నారు. అనంతరం యువత, క్రీడలు, రాజకీయాలు, ఎన్నికల సమగ్రతపై జరిగే ప్యానెల్స్‌లో మంత్రి అజారుద్దీన్‌, రెజ్లర్‌, ఎమ్మెల్యే వినేశ్‌ ఫొగాట్‌, ఎంపీ శశికాంత్‌ సెంథిల్‌ తదితరులు పాల్గొంటారు. అంతర్జాతీయ చర్చల్లో ప్రజాస్వామ్య జవాబుదారీతనం, ప్రగతిశీల రాజకీయాలకు వినూత్న ఆలోచనలు, నూతన ప్రపంచ వ్యవస్థ, ప్రపంచ శాంతి, మీడియా భవిష్యత్తు అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి. సమావేశాల్లో కాంగ్రెస్‌ ఎంపీలు ప్రవీణ్‌ చక్రవర్తి, సచిన్‌ పైలట్‌, మనీష్‌ తివారీ, పవన్‌ ఖేరా తదితరులు మోడరేటర్లుగా వ్యవహరించనున్నారు. ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షురాలు సంగిత బరువా పిషారోటి, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు మీడియా భవిష్యత్తుపై జరిగే చర్చలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 3గంటలకు జరిగే ముగింపు సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి స్వాగత ప్రసంగాలు చేయనుండగా.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక ప్రసంగాలు చేస్తారు. శనివారం ముగింపు సదస్సులో రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు. ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ రానున్నారు. శనివారం ఉదయం గిగ్‌ వర్కర్లతో నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారని, సాయంత్రం సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపారు.


మోదీ సర్కారుపై ఎడిటర్స్‌ గిల్డ్‌ తీవ్ర విమర్శలు

నార్వే జర్నలిస్టు హెలా వీసా రద్దు నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రశ్నలంటే ప్రభుత్వానికి ఎందుకంత భయమని కాంగ్రెస్‌ నిలదీసింది. ఎడిటర్స్‌ గిల్డ్‌ స్పందిస్తూ.. ఇటువంటి చర్యలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ప్రతిష్ఠకు తీవ్ర నష్టం చేకూరుస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశ రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కుగా ఉంది. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిలో ఉండాలన్నా అది తప్పనిసరి. హెలాకు ఇచ్చిన వీసాను రద్దు చేయటానికి కారణాలేమిటో ప్రభుత్వం వెల్లడించాలి. ఇప్పటికైనా ఆమె వీసాను పునరుద్ధరించి సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించాలి’ అని డిమాండ్‌ చేసింది. సీనియర్‌ జర్నలిస్టు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాగరిక ఘోష్‌ స్పందిస్తూ.. ‘ప్రశ్నలు అడుగుతున్నందుకుగాను ఓ జర్నలిస్టు వీసాను రద్దు చేస్తారు.. విదేశాలకు వెళ్లి ప్రజాస్వామ్యం గురించి మాత్రం ఉపన్యాసాలు ఇస్తుంటారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా ఇది సిగ్గుచేటు’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

Updated Date - Nov 13 , 2026 | 03:20 AM