దుర్గంచెరువు దుర్గంధంపై ‘హైడ్రా’ నజర్
ABN , Publish Date - Jan 21 , 2026 | 07:19 AM
నగరంలోని మాదాపూర్ ఏరియాలోగల దుర్గంచెరువు దుర్గంధంపై ‘హైడ్రా’ దృష్టిసారించింది. ప్రస్తుతం చెరువు చుట్టుపక్కల కొంద ఆక్రమణలకు గురవడమేగా, మరికొంత వ్యర్ధాలతో నిండిపోతోంది. అయితే.. దీనిపై హైడ్రా నజర్ పెట్టినట్లు సమాచారం.
- పరిశీలించిన రంగనాథ్
- అధికారులతో సమావేశం
హైదరాబాద్: దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా దృష్టి సారించింది. దానిలో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(HYDRAA Commissioner AV Ranganath) మాదాపూర్‌లోని దుర్గం చెరువును వివిధ శాఖల అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. చెరువును అభివృద్ధి చేయడమంటే పైపై మెరుగులు దిద్దడం కాదని పనులు నిర్వహిస్తున్న రహేజా సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు. చెరువులో మురుగు కలుస్తూ దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ(GHMC), జలమండలి అధికారులతో కలిసి రంగనాథ్ పరిశీలించారు.

రహేజా మైండ్ స్పేస్, ఎస్‌టీపీల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రాంకీ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, బాధ్యతగా పనులు నిర్వహించక పోవడమే దుర్గం చెరువు దుర్గంధానికి కారణమని కమిషనర్ పేర్కొన్నారు. చుట్టుపక్కల మురుగు నీరంతా ఎస్‌టీపీ లైన్లోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా, సంబంధిత అధికారులు, ఆ దిశగా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మురుగు నీరు శుభ్రం అయిన తర్వాత ఆయా నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పీసీబీకి పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరద కాలువలోకి మురుగు నీరు వెళ్లకుండా పైపులైన్ డైవర్షన్ పనులు చేపట్టడానికి జలమండలికి ఉన్న ఇబ్బందులను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. కాగా, గుర్రపు డెక్క కారణంగా దుర్గం చెరువులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటు షికారు నిలిచిపోయింది.

ట్రాఫిక్ డైవర్షన్‌కు సహకరించాలి
అభివృద్ధి పనుల నిర్వహణ సమయంలో ట్రాఫిక్ డైవర్షన్‌కు సహకరించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం హైడ్రా కార్యాలయంలో వివిధ శాఖల అధికారుతో కమిషనర్ సమావేశ మయ్యారు. ఇదిలాఉండగా ఖాజాగూడ చెరువు కబ్జాలపై ఫిర్యాదులు రావడంతో ఆ ప్రాంతాన్ని కూడా రంగనాథ్ పరిశీలించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
Read Latest Telangana News and National News