అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్..? రంగంలోకి దిగిన డీసీపీ
ABN , Publish Date - May 20 , 2026 | 08:16 AM
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పరిధిలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. జనసంచారం ఉన్న ప్రాంతంలో అందరూ చూస్తుండగానే ఓ యువతిని కొందరు దుండగులు కారులో కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, మే 20: నగరంలోని అత్తాపూర్ పరిధిలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. జనసంచారం ఉన్న ప్రాంతంలో అంతా చూస్తుండగానే ఓ యువతిని కొందరు దుండగులు కారులో కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. అత్తాపూర్ ప్రాంతంలో ఒక యువతి రోడ్డుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా అక్కడికి ఒక మహీంద్రా తార్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన నలుగురు వ్యక్తులు.. అంతా చూస్తుండగానే యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. జనం మధ్యలో ఈ ఘటన జరగడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు.
రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్, లోకల్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు. దుండగులు వచ్చిన తార్ కారు నంబర్, వారు పారిపోయిన మార్గాన్ని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే, అసలు ఇది నిజంగానే కిడ్నాపా? లేక దీని వెనుక మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్ ఇప్పుడు కీలకంగా మారింది. కారులో వచ్చిన యువకులతో సదరు యువతికి ముందు నుంచే పరిచయం ఉన్నట్లు అనిపించిందని కొందరు స్థానికులు చెబుతున్నారు. పరిచయస్తులే కావాలనే ఇలా చేశారా, లేక ప్రేమ వ్యవహారాలు లేదా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు.. పంజాగుట్టలోని ఓ బంగారు వ్యాపారిని వికాస్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. దాంతో పంజాగుట్ట పోలీసులను సదరు బంగారు వ్యాపారి కుటుంబం ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారు వ్యాపారి నివాసం పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. వరుస కిడ్నాప్‌లు ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
నకిలీ మద్యం కేసులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసిన అధికారులు
దొంగల బీభత్సం.. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్