యువతి కిడ్నాప్ కేసు.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు
ABN , Publish Date - May 20 , 2026 | 03:01 PM
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో జోయ్ ఆస్పత్రి వద్ద యువతి కిడ్నాప్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హైదరాబాద్, మే 20: అత్తాపూర్‌లోని జోయ్ ఆస్పత్రి వద్ద యువతి కిడ్నాప్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హాస్పిటల్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. యువతిని కిడ్నాప్ చేసిన వాహనాన్ని అత్తాపూర్ నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు ఛేజ్ చేసినప్పటికీ కిడ్నాపర్లు పారిపోయారు. కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో వివరాలు సేకరించడం సవాల్‌గా మారింది.
ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు..
‘రాత్రి 10:45 నిమిషాలకు ఆస్పత్రిలోని ఈఆర్ బ్లాక్ వెనుక భయాందోళనతో ఓ యువతి పరుగెత్తింది. యువతిని ఓ గుర్తు తెలియని వ్యక్తి వెంబడించాడు. సెల్లార్ వైపు పరిగెత్తిన యువతిని మా హాస్పిటల్ సిబ్బంది గమనించారు. ‘నాకు ప్రమాదం ఉంది’ అంటూ యువతి బాత్రూంలో దాక్కుంది. నన్ను కాపాడండి.. వాళ్లు నన్ను వెంబడిస్తున్నారు అంటూ యువతి ఆర్తనాదం చేసింది. సెక్యూరిటీ గార్డులను సహాయం చేయాల్సిందిగా యువతి కోరింది. హాస్పిటల్ ఎదురుగా ఆపి ఉన్న థార్ కారు దగ్గర అనుమానిత వ్యక్తులు ఉన్నారు. వారు యువతిని చూపించి ‘మా అమ్మాయి’ అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువు అంటూ యువతిని తీసుకెళ్లేందుకు అనుమానితులు ప్రయత్నించారు. వారి బెదిరింపులతో యువతి భయపడింది. ఆమె ఇష్టం లేకుండానే.. దుండగులు బెదిరించి బలవంతంగా కారు ఎక్కించారు. హాస్పిటల్ ప్రాంగణం నుంచే యువతిని బలవంతంగా తీసుకుని వెళ్లారు’ అంటూ ఫిర్యాదు పేర్కొన్నారు.
యువతి ఫోన్ నంబర్ ట్రేస్..
అత్తాపూర్ కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నాప్‌కు గురైన యువతి ఫోన్ నంబర్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. జోయ్ హాస్పిటల్ పక్కనే ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొన్ని వస్తువులను యువతి కొన్నట్టు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. రాత్రి 10:30 గంటలకు క్లోజింగ్ టైమ్‌లో వెళ్లి వాటర్ బాటిల్, చాక్లెట్స్, కొన్ని స్నాక్స్‌ను యువతి కొన్నట్లు తెలుస్తోంది. ఆ టైంలో జరిపిన ట్రాన్సాక్షన్ ఆధారంగా యువతి నంబర్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. ఆమె కొనుగోలు చేసిన వస్తువులకు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించినట్టు గుర్తించారు. దీంతో ఫోన్ పే నోడల్ అధికారిని పోలీసులు వివరాలు అడిగారు. కాసేపట్లో ఫోన్ పే నోడల్ అధికారి నుంచి యువతి వివరాలు రానున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి వివరాలు వస్తే కేసు డిటెక్ట్ అయినట్టే అని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం
నిర్మలా సీతారామన్‌తో భేటీ.. తెలంగాణకు అదనపు ఆర్థిక సాయం కోరిన భట్టి
Read Latest Telangana News And Telugu News