కుప్పలుగా నోట్ల కట్టలు.. జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - May 19 , 2026 | 10:25 AM
హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్, మే 19: హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి.. హైదరాబాద్‌తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్‌లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
ఈ తనిఖీల్లో భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో.. ఆ నగదు లెక్కింపునకు కౌంటింగ్ మెషీన్లను అధికారులు వినియోగిస్తున్నారు. దాదాపు రూ.1.20 కోట్ల నగదు,1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో మూడు ఫ్లాట్‌లు, 6 ఓపెన్ ప్లాట్‌లను అధికారులు గుర్తించారు.
బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మల్లాపూర్‌లోని కుమార్ నివాసంలో 2 కార్లను సీజ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ప్రాథమికంగా 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గత నెలలో తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా ఎంతో డబ్బులు వెచ్చించి మరీ జరిపించాడు. వివాహం కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆ డబ్బులు ఎలా సంపాదించారనే దానిపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
దొంగల బీభత్సం.. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్
Read Latest Telangana News And Telugu News