కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ‘శుద్ధి’పై అసెంబ్లీలో దుమారం.. బీఆర్ఎస్‌పై మంత్రి ఫైర్
ABN , Publish Date - Sep 09 , 2026 | 10:16 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే నిన్న సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ఎస్సీ సంఘాలు నిరసన తెలిపిన ప్రాంతాన్ని బీఆర్‌ఎస్ నేతలు శుద్ధి చేయడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే నిన్న(మంగళవారం) సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ఎస్సీ సంఘాలు నిరసన తెలిపిన ప్రాంతాన్ని బీఆర్‌ఎస్ నేతలు శుద్ధి చేయడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంటి దగ్గర శుద్ధి చేయడం దళితులను అవమానపర్చడమే అని విమర్శించారు. శుద్ధి కార్యక్రమంపై చర్చ జరగాలని పట్టుపట్టారు. దళితుల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ నేతలు దెబ్బతీశారని మండిపడ్డారు.
స్పీకర్‌ను తిట్టింది మర్చిపోకముందే, మరోసారి తమ కులతత్వాన్ని చూపెట్టారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. మంత్రి ప్రసంగిస్తుండగా బీఆర్‌ఎస్ నేతలు నిరసన తెలుపుతూ అడ్డుతగిలారు. మహిళా సభ్యుల పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తనకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
దొరతనపు పోకడలు నడవవు: డిప్యూటీ సీఎం
బీఆర్ఎస్ నిరసనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘చేయాల్సిన అవమానాలన్నీ చేశారు. మనం చేసుకున్న రూల్స్ కూడా పాటించడం లేదు. సభాపతి మాట్లాడేప్పుడు సైలెంట్‌గా ఉండరాదా? స్పీకర్‌తో ఆర్గ్యుమెంట్ చేయడం ఏంటి?ఆత్మగౌరవంతో ఏర్పడిన రాష్ట్రం మనది. బీఆర్ఎస్ నేతలకు ఏం జస్టిస్ కావాలి. సభాపతిని, ఆయన తల్లిని తిట్టారు. నిరసన తెలియచేస్తే ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేస్తారా? శుద్ధి కార్యక్రమంపై చర్చ జరగాల్సిందే. దొరతనపు పోకడలు నడవవు’ అంటూ భట్టి విరుచుకుపడ్డారు.
ఇలా చేయడం న్యాయమా: స్పీకర్
బీఆర్‌ఎస్ ఆందోళనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ.. రాతపూర్వకంగా ఇస్తే అవకాశం ఇస్తానని తెలిపారు. స్పీకర్ ముందు నిల్చొని నినాదాలు ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. మంత్రులుగా చేసిన వాళ్లు ఇలా చేయడమేంటి అంటూ స్పీకర్ ఫైర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి...
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణమిదే!
ఎండైనా వానైనా.. హైదరాబాద్ హైరానా
Read Latest Telangana News And Telugu News