తెలుగు సినిమా హాలీవుడ్‌తో పోటీపడాలి!
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:59 AM
తెలుగు సినిమా హాలీవుడ్‌తో పోటీపడాలని, హాలీవుడ్ సినిమాల చిత్రీకరణ కూడా మన హైదరాబాద్‌లో జరుపుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.
సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 12: తెలుగు సినిమా హాలీవుడ్‌తో పోటీపడాలని, హాలీవుడ్ సినిమాల చిత్రీకరణ కూడా మన హైదరాబాద్‌లో జరుపుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. భవిష్యత్తులో అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలన్నారు. ‘అవతార్’ లాంటి సినిమాలను టాలీవుడ్‌లోనూ నిర్మించాలని వ్యాఖ్యానించారు. గురువారం కోకాపేటలో ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘అల్లు కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను సినీ అభిమానిని. మన దేశంలో సినిమా సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ పరంగా సినిమాని ఎంత బాగా తీసినా వాటికి తగ్గ స్ర్కీన్లు లేకపోతే వృథా. డాల్బీ విజన్‌తో వందలాది మందితో కలిసి కూర్చొని సినిమా చూస్తే ఆ ఆనందమే వేరు. సినీ రంగంలో సాంకేతికంగా సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో ప్రయోగాలు చేశారు. నేను ఆయన అభిమానిని. నేను లారీలో వనపర్తికి వెళ్లి సినిమాలు చూసేవాడిని. మధ్యతరగతి ప్రజలపై ప్రభావం చూపే మాధ్యమం సినిమా. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమను గొప్ప పరిశ్రమగా గుర్తిస్తోంది’’అని రేవంత్ చెప్పారు. ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్‌కు, దేశానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు.