‘కారుణ్యం’తో వచ్చి.. అక్రమాలకు అలవాటుపడి..
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:15 AM
ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడింది లేదు.. రేయింబవళ్లు చదివింది లేదు. తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాడు. అది కూడా ఓ శాఖలో కొలువులో చేరి.. మరో శాఖలోకి బదిలీ అయ్యాడు.
తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి అవినీతి దందా..
పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరిక
రెవెన్యూ శాఖలోకి మారి.. పదోన్నతులు
వీఆర్‌వో నుంచి తహసీల్దార్ స్థాయికి
వివాదాస్పద భూములపైనే కన్ను
రికార్డులు మార్చి ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్
అంతా తన బంధువులు.. బినామీలే!
తుర్కయాంజల్‌లో ఓ మహిళకు 2.30 ఎకరాల పట్టా
హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా చర్య
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడింది లేదు.. రేయింబవళ్లు చదివింది లేదు. తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాడు. అది కూడా ఓ శాఖలో కొలువులో చేరి.. మరో శాఖలోకి బదిలీ అయ్యాడు. ఆ తరువాత అంచెలంచెలుగా తహసీల్దార్ స్థాయికి ఎదిగాడు. కనిపించిన చోటల్లా అవినీతికి పాల్పడ్డాడు. చివరికి ఓ బాధితుడి వద్ద రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ బండారు సుదర్శన్‌రెడ్డి సర్వీసు అంతా అక్రమాలు, అవినీతిమయమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడ పని చేసినా.. వివాదాస్పద భూములపై కన్నేయడం, వాటిని సెటిల్మెంట్ చేసి పెద్దఎత్తున దండుకోవడం సుదర్శన్‌రెడ్డికి అలవాటుగా మారింది.
ఆయన కన్ను పడినా.. ఆయనకుడబ్బులిచ్చినా.. ప్రభుత్వ భూమి, పట్టా భూమి ఏదైనా సరే.. పేరు పక్కాగా మారిపోతుందని పలువురు బాధితులు చెబుతున్నారు. పట్టాదారులు ఇతర దేశాల్లో ఉన్నా సరే.. వారిని పోలిన మనుషులను తీసుకువచ్చి మరీ భూమార్పిడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుదర్శన్‌రెడ్డి సొంతూరు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని జైత్వారం గ్రామం. ఆయన తండ్రి ఆ గ్రామంలో పట్వారీగా పనిచేసేవారు. తండ్రి మరణాంతరం కారుణ్య నియామకం కింద 2000 సంవత్సరంలో సుదర్శన్‌రెడ్డికి పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం కల్పించారు. అయితే.. తండ్రి చనిపోయిన సమయంలో ఆయనకు ఉద్యోగానికి కావాల్సిన వయసు లేకపోవడంతో 2002లో ఉద్యోగంలో చేరాడు.
పంచాయతీరాజ్ నుంచి రెవెన్యూలోకి..
అప్పట్లో రెవెన్యూ శాఖలో పనిచేసిన వీఆర్‌వోలకు కూడా పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఇచ్చారు. అటు తర్వాత 2007లో గతంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన వారిని తిరిగి వీఆర్‌వోలుగా మాతృశాఖకు రావాలని కోరడంతో వారు అందులోకి వెళ్లారు. కానీ, పంచాయతీరాజ్ శాఖలోనే ఉద్యోగంలో చేరిన సుదర్శన్‌రెడ్డి కూడా రెవెన్యూశాఖలో వీఆర్‌వో అయ్యాడు. డిపార్ట్‌మెంటల్ టెస్టులురాసి.. సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా, డిప్యూటీ తహసీల్దార్‌గా, తహసీల్దార్‌గా పదోన్నతులు పొందుతూ వచ్చాడు. పంచాయతీ కార్యదర్శిగా, వీఆర్‌వోగా, ఆర్‌ఐగా ఉమ్మడి హయత్‌నగర్ మండలాల పరిధిలో ఎక్కువ కాలం పనిచేశాడు. వివాదాస్పద భూముల లోతుల్లోకి వెళ్లి పరిజ్ఞానం సాధించాడు. సెటిల్‌మెంట్లు చేసి పెద్దఎత్తున డబ్బులు దండుకున్నాడని, కలెక్టర్, సీసీఎల్‌ఏ వరకు అన్నీ తాను చూసుకుంటానంటూ భారీ గా ముడుపులు తీసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు.
రికార్డులు మార్చి బంధువుల పేర్లపై..
ఉమ్మడి హయత్‌నగర్ మండల పరిధిలో తుర్కయాంజల్‌తో పాటు పలు రెవెన్యూ గ్రామాల పరిధిలో నవాబుల భూములున్నాయి. 1956 నుంచి వాటిని విక్రయిస్తూ వస్తున్నారు. అయితే తుర్కయాంజల్ రెవె న్యూ గ్రామ పరిధిలో 658 ఎకరాలు నవాబులకు ఉండగా.. వాటిని స్వాతంత్ర్యానంతరం కొంతమంది స్థానికులకు విక్రయించారు. గ్రామస్తులకు సాదాబైనామా చేయడంతో అప్పటి పహాణీలో వారి పేర్లు నమోదయ్యాయి. అయితే ఆ భూ రికార్డులనూ మార్చి ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులపేర్లను అప్పట్లో వీఆర్‌వోగా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి ఎక్కించారనే ఆరోపణలున్నాయి. వారిలో ఎక్కువ మంది ఆయన బంధువులే ఉన్నట్లు తెలుస్తోంది.
వాస్తవంగా 658 ఎకరాల భూములు తొలుత మహబూబ్ బేగం అనే మహిళ పేరుపై ఉన్నాయి. ఇందులో కొంత భూమిని దక్కించుకునేందుకు ఆమెను పోలిన ఓ మహిళను తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. మన్నె ముత్యాలమ్మ కుంట (ఎంఎం కుంట) పరిధిలోని సర్వే నంబర్ 540లో ఏకంగా రూ.100 కోట్ల విలువ చేసే 2.30 ఎకరాల భూమిని ఓ మహిళకు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. ఈ భూమి 70 ఏళ్లుగా ఓ కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తోం ది.
దీంతో ఈ భూమిని ఆ కుటుంబం పేరిట భూభారతిలో ఆరు నెలల్లో ఎక్కించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ, నిర్ణీత గడువుకు నెల రోజుల ముందే బినామీగా ఓ మహిళను పెట్టి ఆమెకు కొన్ని డబ్బులు ఇచ్చి 2.30 ఎకరాలను భూభారతి భూరికార్డులోకి ఎక్కించి తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి పట్టాదారు పాస్‌బుక్ జారీ చేసినట్లు తెలిసింది. ఇలా.. పలు గ్రామాల్లో రూ.100 కోట్ల విలువ చేసే వివాదాస్పద భూములన్నింటినీ తన బినామీల పేరు మీదకు సుదరర్శన్‌రెడ్డి మార్చారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
వినోదంలో పెను విషాదం.. ఇంజనీరింగ్ కాలేజీ ఉత్సవంలో ప్రమాదం
ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన.. బాధితులకు సీఎం రేవంత్ భరోసా