ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం.. అనుకోని మలుపులు
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:33 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు పనులు ఒకపట్టాన ముందుకు పడటం లేదు. 2016లో మంజూరైన ఈ ప్రాజెక్టులో ఉత్తరభాగం భూ సేకరణ పనులు ఇంకా పూర్తవనేలేదు.
నిర్మాణ బాధ్యతలు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్‌కు అప్పగింత
భూసేకరణ, ఇతర ప్రక్రియలను ప్రారంభించాలని సర్కారు ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును చేపట్టే దిశగా చర్యలు!
రూ.20వేల కోట్లకుపైగా అవసరమని ప్రాథమిక అంచనా
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు పనులు ఒకపట్టాన ముందుకు పడటం లేదు. 2016లో మంజూరైన ఈ ప్రాజెక్టులో ఉత్తరభాగం భూ సేకరణ పనులు ఇంకా పూర్తవనేలేదు. దక్షిణ భాగంపై కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ ప్రాజెక్టును రోడ్లు-భవనాల శాఖ పరిధి నుంచి తప్పిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు అనుబంధంగా ఉండే ‘హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్)’కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత శాఖల అధికారులు తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆర్ అండ్ బీ దగ్గరున్న ఫైళ్లన్నింటినీ హెచ్‌జీసీఎల్‌కు అప్పగించాలని సూచించింది. దాదాపు 761 పేజీల రికార్డులను అధికారులు బదిలీ చేయనున్నారు. ఇక నుంచి ఆర్ఆర్ఆర్ దక్షిణభాగానికి సంబంధించిన అన్ని పనులను హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) పర్యవేక్షిస్తారు.
ప్రాజెక్టుకు సంబంధించిన గత ప్రతిపాదనలు, పరిపాలనా నిర్ణయాలు, భూ సేకరణకు సంబంధించిన సమాచారం, తదుపరి చేపట్టాల్సిన పనులు కూడా హెచ్‌జీసీఎల్‌కు బదిలీ అవుతాయి.ప్రాజెక్టు హెచ్‌జీసీఎల్ పరిధిలోకి రావడంతో మరోసారి ఈ మార్గం అలైన్మెంట్, డీపీఆర్ సహా పలు అంశాలను రూపొందిస్తారా, ప్రస్తుతం ఉన్న వాటినే పరిగణనలోకి తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం భూసేకరణ, నిర్మాణానికి సంబంధించిన నిధుల అంశం తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఔటర్ రింగు రోడ్డును నిర్మించిన తరహాలోనే దక్షిణభాగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని మొదట్లో భావించింది. ప్రత్యేక కమిటీని నియమించి, అలైన్మెంట్ సహా ఇతర వ్యవహారాలను పూర్తిచేసింది.
ప్రాజెక్టు నిర్మాణానికి రూ.16వేల కోట్లకుపైగా నిధులు అవసరమని అంచనాల్లో తేలింది. దాంతో కేంద్రానికి లేఖలు రాయగా.. నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌జీసీఎల్ పరిధిలో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగంలో 161 కిలోమీటర్ల దూరానికి పీపీపీ అప్రైజల్ కమిటీ రూ.23,830 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపింది. దాని ప్రకారం దక్షిణభాగం 201 కిలోమీటర్ల పొడవునా ఉండటం, భూముల ధరలు కూడా అధికంగా ఉండటంతో.. భూ సేకరణకే దాదాపు రూ.8-9వేల కోట్ల వరకు నిధులు అవసరమని.. నిర్మాణం, ఇతర ఖర్చులు కలిపి రూ.20 వేల కోట్లకుపైగానే నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధుల సమీకరణ ఎలాగన్న దానిపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ వార్తలూ చదవండి
వినోదంలో పెను విషాదం.. ఇంజనీరింగ్ కాలేజీ ఉత్సవంలో ప్రమాదం
ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన.. బాధితులకు సీఎం రేవంత్ భరోసా