ముగిసిన ఎన్నికల ప్రచారం..
ABN , Publish Date - Feb 09 , 2026 | 06:33 PM
ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీ అంటే శుక్రవారం వెలువడనున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 09: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ రోజు సాయంత్రం 5:00 గంటలకు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. బుధవారం అంటే.. ఫిబ్రవరి11వ తేదీన రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు పోలింగ్ జరగనుంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు, అగ్రనేతలు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలతో హోరెత్తిపోయింది.
ఎన్నికల ప్రచారం ముగియడంతో మైకులు మూగబోయాయి. అగ్రనేతలతో పాటు రాజకీయ పార్టీల కేడర్ అంతా ఇంటి బాటపట్టింది. ఆఖరి రోజు ప్రచారంలో పాల్గొన్న నేతలు.. ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు.. ఏ పార్టీకి పట్టం కడతారనేది ఫిబ్రవరి 13న తేలనుంది.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌ల వద్దకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,996 వార్డులకు 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో 12,993 మంది అభ్యర్థులు బరిలో దిగారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. సీసీటీవీ కెమెరాల మానిటరింగ్‌తో పోలింగ్ బూత్‌ల వద్ద రాష్ట్ర ఎన్నికల సంఘం నిఘాను పెంచింది. 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీ అంటే శుక్రవారం వెలువడనున్నాయి. ఇక రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.