పీజీ విద్యార్థులు, ఫ్యాకల్టీకి టీజీఎంసీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ABN , Publish Date - Nov 22 , 2026 | 08:14 AM
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు(డీఎంఈ) సర్క్యులర్ జారీ చేశారు.
హైదరాబాద్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు(డీఎంఈ) సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చాలామంది పీజీ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, కొందరు ఫ్యాకల్టీ సభ్యులు రెన్యూవల్ చేయించుకోలేదని గుర్తించారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్న డాక్టర్లందరికీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. అర్హులైన పీజీ విద్యార్థులందరూ డిసెంబర్ 31 లోపు రిజిస్ట్రేషన్ పొందాలని ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల ఫ్యాకల్టీ సభ్యులు తమ రిజిస్ట్రేషన్ చెల్లుబాటులో ఉండేలా చూసుకుని, అవసరమైన చోట రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. తమ సంస్థల పరిధిలోని పీజీ విద్యార్థులు, ఫ్యాకల్టీ అందరి రిజిస్ట్రేషన్ స్టేటస్‌ను ప్రిన్సిపాళ్లు, మెడికల్ సూపరింటెండెంట్లు పరిశీలించాలని సర్క్యులర్‌లో కోరారు. పెండింగ్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ వివరాలతో సమగ్ర నివేదికను డిసెంబర్ 31 నాటికి డీఎంఈకి సమర్పించాలన్నారు.
సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దివంగత అనంతుల మదన్ మోహన్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్. చోంగ్తూ జీవో జారీ చేశారు. సిద్దిపేట పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇకపై ఈ కాలేజీని ‘అనంతుల మదన్ మోహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్’గా పిలవనున్నారు. ఇదే పేరును సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కాలేజీ, ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ పేర్ల ముందు కూడా చేర్చనున్నారు. ఆయా సంస్థల పరిపాలన, విద్య, నియంత్రణ వ్యవస్థల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక