గ్లోబల్ సమ్మిట్‌లో భాగస్వామ్యం కండి
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:24 AM
ఆరోగ్య రంగంలో రాష్ట్రాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
హెల్త్‌కేర్ రంగ ప్రముఖులతో వైద్య మంత్రి దామోదర
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య రంగంలో రాష్ట్రాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఆస్పత్రుల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు ఉన్న వైద్యరంగ సామర్థ్యాన్ని మరింత విస్తరించి, మెడికల్ టూరిజంలో నగరాన్ని గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో హెల్త్‌కేర్ రంగ ప్రతినిధులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. మెడికల్ టూరిజం అభివృద్ధికి ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మెడికల్ టూరిజం అభివృద్ధి కోసం ఆరోగ్యశాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో పాల్గొన్న డాక్టర్లు మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు తెలిపారు.
జాయింట్ రీప్లే్‌సమెంట్, న్యూరో, కార్డియో థొరాసిక్ సర్జరీల వంటి ప్రత్యేక వైద్య విభాగాల్లో ప్రభుత్వ సర్వీసులో కొత్తగా చేరే వైద్యులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కిమ్స్-సన్‌షైన్ ఎండీ డాక్టర్ గురువా రెడ్డి, ఇతర వైద్యులు వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో హానరరీ ప్రొఫెసర్లుగా సేవలందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో తెలంగాణ ఫార్మా వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కొండపల్లి సాహితి, కిమ్స్-సన్‌షైన్ ఎండీ డాక్టర్ గురువా రెడ్డి, ఫిక్కీ మెంబర్ సర్జన్ కెప్టెన్ డాక్టర్ విజయ్ కుమార్, రెయిన్‌బో హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్, యూఎన్ మాజీ అధికారి డాక్టర్ శివ దుబిశెట్టి, యశోద హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..